ఏదైనా ఒక సంస్థ నష్టాల్లో ఉంటె ఆ సంస్థ నష్టాలను తగ్గించుకోవడానికి కొంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది.  అది మాములు విషయమే.  అందుకు ఎవరూ అడ్డు చెప్పరు.  కానీ ఏకంగా ఒకేసారి 50వేలమంది ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రభుత్వంతో అనుబంధంగా పనిచేసే సంస్థలు కూడా ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన సంఘటనలు లేవు.  


కానీ, మొదటిసారి తెలంగాణాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  ఈరోజు సమ్మెపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది.  నిన్న సాయంత్రం 6 గంటల వరకు విధులకు హాజరైన 1200 మంది సిబ్బందిని మాత్రమే ఉద్యోగుల పరిగణిస్తామని, మిగతా వారిని విధుల నుంచి తొలగిస్తామని, వారు ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తింపబడరని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.  


ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని, పండుగ సమయంలో ఇలా సమ్మె చేయడం వలన ఆర్టీసీకి మరింత నష్టం వస్తుందని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి అంటే ఇకపై ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు కూడా నడపాలని నిర్ణయించింది.  తద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది.  


అయితే, ఆర్టీసీ కార్మికులు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఇలాంటివి చాలా చూశామని, ఒకేసారి ఏ ప్రభుత్వం కూడా 50వేలమంది ఉగ్యోగులను తొలగించిన సంఘటనలు లేవని, ప్రజాస్వామ్య దేశంలో అది అసాధ్యం అని అన్నారు.  సకలజన సమ్మె సమయంలో కూడా బతుకమ్మ, దసరా సంబరాలు జరిగాయని, అప్పుడు కూడా సకలజన సమ్మెలో పాల్గొన్నట్టు కార్మికులు తెలిపారు.  ఆ సమయంలో ప్రజలకు కలగని ఇబ్బందులు ఇప్పుడు ఎలా కలుగుతాయని అన్నారు.  


న్యాయపరంగానే తాము కూడా ముందుకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి.  ఈరోజు ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. రేపు సింగరేణి విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోకుండా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.  సింగరేణిలో ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి.  వారిపై కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాలి.  ఎందుకంటే కార్మిక సంఘాలు ఇకపై ఉండకూడదు అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.  దీనిపై సింగరేణి కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: