రాజ‌కీయ చైత‌న్యానికి సుప‌రిచిత‌మైన హ‌ర్యానా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. హర్యానాలో ఈనెల 21న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పట్టు సాధించి అధికార పగ్గాలు చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ సర్వశక్తూలు ఒడ్డుతోంది. 90 అసెంబ్లీ స్థానాల్లో 75 కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మ‌రోవైపు, ఎలాగైనా ఈ ద‌ఫా బీజేపీని గ‌ద్దె దించాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, ప్ర‌ణాళిక‌ల ప‌రంగా బీజేపీ ముందుడ‌టం గ‌మ‌నార్హం.


హ‌ర్యానా అధికార పీఠాన్ని తిరిగి సొంతం చేసుకోవాల‌ని..గెలుపే లక్ష్యంగా స్టార్ క్యాంపెయినర్లు అందరినీ ప్రచార బరిలోకి దింపి ఎలాగైనా మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆయా వర్గాలకు చెందిన ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటులను బరిలోకి దింపుతోంది. దాదాపు 40మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచార బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారంలో పాల్గొంటారు. జాట్ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆ వర్గానికి చెందిన ప్రముఖులందరినీ ఆయా ప్రాంతాల్లో మోహరించనున్నారు. 


ఇక సినీన‌టులను సైతం బీజేపీ రంగంలోకి దింపుతోంది.  గెలుపే లక్ష్యంగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు, నటులు నామినేషన్ల పర్వంలో సైతం తమ వంతు పాత్ర నిర్వహించ‌నున్నారు. భోజ్‌పురి ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆ వర్గానికి చెందిన నటులు, ఎంపీలైన రవి కిషన్, మనోజ్ తివారీలో పట్టణ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. ఇక బాలీవుడ్ నటులు హేమమాలిని, సన్నీడియోల్, ప్రఖ్యాత సింగర్ హన్స్‌రాజ్ హన్స్‌లు కూడా ప్రచారంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయనున్నారు.జాట్ నేతలైన సత్యపాల్ సింగ్, భూపీంద్ర సింగ్‌లను ప్రచారంలోకి దింపి ఆ వర్గ ఓట్లను ఎలాగైనా సాధించాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇక పొరుగు రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌లు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బరిలో నిలిచి పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ ఎన్నికలు ముగిసే వరకు ఇక్కడే ఉండి పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.  ముజఫర్‌నగర్ ఎంపీగా గెలుపొందిన బాల్యన్ ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్‌ను ఓడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: