తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని, సమ్మెకు దిగిన కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలు జరపబోమని సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాలకు తీసుకోబోమని చెప్పి ఆర్టీసీ కార్మికులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంతో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఆసక్తికరమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
 
సీఎం కేసీఆర్ కఠినంగానే వ్యవహరించినప్పటికీ సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళనాడు రాష్ట్రంలో లక్ష మంది ఉపాధ్యాయులు సమ్మె చేశారు. 
 
ఆ సమయంలో అప్పటి సీఎంగా ఉన్న జయలలిత ఎస్మా చట్టం ప్రయోగించి దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించింది. కానీ లక్ష మంది ఉద్యోగులను తొలగించటంపై ప్రజల్లో అగ్రహం వ్యక్తమైంది. ప్రజలు ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసిన జయలలిత పార్టీని ఓడించి షాక్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఉద్యోగులను తొలగించినట్లు చెబుతూ ఉండటంతో ఆందోళన మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 
 
మరోవైపు ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పినట్లు తెలుస్తోంది. గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించటానికి వచ్చిన అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలికంగా నియామకాలు చేపడుతున్నారని తెలుస్తోంది. ఆర్టీసీలో కొత్త నియామకాల కొరకు డ్రైవర్, కండక్టర్ అభ్యర్థులు భారీ సంఖ్యలో డిపోల దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: