కశ్మీర్‌ లోయలో రైస్‌ బౌల్‌గా పేరున్న ఎనిమిది తాలూకాల్లో త్రాల్‌ కూడా ఒకటి.  ఈ ఎనిమిది ప్రాంతాల్లోనూ  ఉగ్రవాదులకు మద్దతు ఎక్కువే. పుల్వామా, రాజ్‌పోరా, కాకాపోరా, త్రాల్‌, షహోరా, అవంతిపురా, అరిపాల్‌లు టెర్రరిస్ట్‌ స్థావరాలు. అందుకే తరచూ భారీగా ఎన్‌కౌంటర్లు జరుగుతుంటాయి.  సైన్యం ఈ ప్రాంతం ఎక్కువ దృష్టిపెట్టడానికి కారణమిదే. లష్కరే తోయిబా కశ్మీర్‌ చీఫ్‌ అబూ ఖాసీంను ఇక్కడే మట్టుబెట్టాయి దళాలు. అల్లరి మూకలు  సైన్యంపై దాడికి దిగేది కూడా ఈ ప్రాంతంలోనే. 


పుల్వామా, అవంతిపురా ప్రాంతాల్లో సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. వాస్తవానికి పుల్వామాలో ఉగ్రదాడులు, బ్యాంక్‌ దోపిడీలు, సైన్యం నుంచి ఆయుధాలు లాక్కొనే ఘటనలు, కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుంటాయ్‌. ఈ ప్రదేశంలో చాలాసార్లు సీఆర్పీఎఫ్‌ బలగాలు టెర్రరిస్ట్‌లకు లక్ష్యంగా మారాయి. అందుకే  కమరాయ్‌ పోరా, కరీమాబాద్‌, సంబూరా, లేల్‌హార్‌, తహబ్‌, అగ్లార్‌, లిట్టర్‌, బమ్ను, కోయిల్‌ ప్రాంతాల్లో ఆపరేషన్‌ అంటే భద్రతా బలగాలు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తాయ్‌. ఉగ్రవాదులకంటే స్థానికుల నుంచే  ఎక్కువ ప్రతిఘటన ఉంటుంది. 


హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీని 2016లో ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత ఈ ప్రదేశం నుంచి ఏడాదిలో దాదాపు 90 మంది టెర్రరిస్ట్‌లుగా మారినట్లు అనుమానిస్తున్నాయ్‌ నిఘా వర్గాలు. విదేశీ ఉగ్రవాదులకు పుల్వామా జిల్లా ఒక డెన్‌. బుద్గామ్‌ జిల్లాలోని పఖర్‌పోరా నుంచి పుల్వామాలోకి వారు వస్తుంటారు. ఈ జిల్లాలోని యర్వాన్‌ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు స్థావరాలుగా మారాయి. ఈ ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశిస్తే.. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు తెలియజేయడానికి  భారీ సంఖ్యలో కొరియర్లు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఒకవేళ బలగాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. టెర్రరిస్ట్‌లు బుద్గామ్‌ లేదా అనంతనాగ్‌, షోపియన్‌ ప్రాంతాలకు పారియేందుకు సహకరిస్తారు స్థానికులు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న భారత బలగాలు పుల్వామాపై పూర్తి ఏకాగ్రత పెట్టాయి. ఈ రెండు మూడు నెలల్లోనే  దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఇక్కడ తిష్ఠ వేసినట్లు తెలుసుకున్నాయి. అందుకే 600లకుపైగా గాలింపు ఆపరేషన్లను చేపట్టాయి. 60 మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటినట్లు గట్టి ఆధారాలు సంపాదించాయి భారత సైనిక బలగాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: