ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టువిడుపు ధోరణితో వెళ్తున్నారా.. సమ్మె మొదటి రెండు రోజులు అస్సలు తగ్గేదే లేదన్న కేసీఆర్ మూడో రోజు కాస్త మెత్తబడ్డారా.. తాజాగా ఆయన వైఖరి చూస్తే కాస్త అదే అనుమానం కలుగుతోంది. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించింది.


ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ... ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం అని ఇప్పడు కేసీఆర్ అంటున్నారు. తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామనీ సీఎం కేసీఆర్ అన్నారు. మొత్తం ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయడం వివేకమైన చర్య కాదని కూడా ఆయన అన్నారు. క్రమశిక్షణను తుచ తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రకటన ద్వారా కేసీఆర్.. తానో మెట్టుదిగడానికి సిద్ధమని చెప్పకనే చెబుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.


రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశారు. ఆ ప్రతిపాదనలను సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు.


సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: