తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప పోరు రోజురోజుకూ రక్తికడుతోంది. అన్ని పార్టీల అగ్ర నాయ‌కులు ఇక్కడే తమ బలగాలు అన్నింటిని మోహరించిన నేపథ్యంలో నియోజకవర్గంలో పదిహేను రోజులపాటు దసరా పండుగ సందడి ఉన్నట్టే కనిపిస్తోంది. ఇక్కడ అధికార టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత మూడు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి పరాజయం తప్పలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి జగదీష్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పోటీ చేసి 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.


ఈ క్రమంలోనే గతంలో తాను ఊడిన చోట ఇప్పుడు పార్టీని గెలిపించి సత్తా చాటేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపఎన్నిక ఇంచార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్‌ గెలుపు కోసం అదిరిపోయే వ్యూహాలు పన్నుతున్నారు. సామాజిక వ‌ర్గాలు, సంఘాల వారీగా నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు వీరు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం నామినేషన్ల చివరి రోజున భారీ సభ నిర్వహించే సత్తా చాటింది.


కాంగ్రెస్ రేసులో వెన‌క ప‌డింద‌న్న అనుమానాలు ఉన్న టైంలో అనూహ్యంగా పుంజుకుంది. ఉత్తమ్‌కు తోడుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, పండుగ తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారానికి రానుండటంతో హస్తం పార్టీ కూడా అధికార పార్టీకి ధీటుగానే ప్రచార బరిలో దూసుకుపోతోంది. ఇక, బీజేపీ కూడా మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జులను నియ‌మించుకుని ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌న్న లెక్క‌ల్లో ఉంటే.. టీడీపీ త‌న ఓటు బ్యాంకును కాపాడుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఎన్ని పార్టీలు ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య‌నే ఉండ‌నుంది.


ఇదిలా ఉంటే కేటీఆర్ రోడ్ షోలో చేసిన వ్యాఖ్య‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి విశేష‌మైన స్పంద‌న ల‌భించించింది. జీ హుజూరా? జై హుజూర్‌నగరా? అంటూ కేటీఆర్‌ చేసిన ఈ కామెంట్‌ను టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. నియోజకవర్గ ప్రజలు ఉత్తమ్‌కు జీ హుజూర్‌ అనకుండా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి జై కొట్టాలనే అర్థంతో చేసిన కేటీఆర్‌ వ్యాఖ్యను క్షేత్రస్థాయి ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నేతలు బాగానే వాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: