``అగ్ర‌రాజ్యం అమెరికా సంబంధం.. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది... కూతురు విదేశాల్లో ఉంటుందంటే మా గౌరవమూ పెరుగుతుంది``అనే ఆలోచనలు ఒకప్పుడు బాగానే ఉండేవి. కానీ ఇదే ఆలోచన ఇటీవ‌ల‌ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఎన్నో కలలతో కన్నబిడ్డ పెళ్లి చేసి పంపిన తల్లిదండ్రులకు కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఇటీవల ఎన్నారై అల్లుళ్ల వేధింపుల కేసులు పెరుగటం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో నివ‌సించే ప్రవాస భారతీయులు (ఎన్నారై)ల్లో మోస‌గాళ్లు షాక్ గుర‌య్యే వార్త ఇది. 


ఎన్నారైలు పెళ్లి పేరిట భారతీయ మహిళలను మోసగిస్తున్న కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం సంచ‌ల‌న‌ బిల్లును తీసుకొచ్చింది. ఎన్నారై `వివాహ నమోదు బిల్లు’ను విదేశాంగశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండిం గ్‌ కమిటీకి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సిఫారసు చేశారు. దీని ప్రకారం ఎన్నారైలు 30 రోజుల్లోపు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నమోదు చేయించడంలో విఫలమైతే వారి పాస్‌పోర్ట్‌ రద్దు లేదా స్వాధీనం చేసుకుంటారు. ‘రాజ్యసభ చైర్మన్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రవాస భారతీయుల వివాహ నమోదు బిల్లు-2019ను విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు చేశారు. రెండు నెలల్లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఇప్పటికే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు’ అని లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ జారీచేసింది.ఈ బిల్లు ఎన్నారైల‌ పాలిట బ్రహ్మాస్త్రంగా మారనుంది.


కాగా, తెలంగాణ‌లో ఎన్నారైల మోసాల‌పై తెలంగాణ పోలీసులు కొద్దికాలం క్రితం సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి తెచ్చింది. ఎన్నారై అల్లుళ్ల కేసుల్లో విదేశాలకు వెళ్లి తిరిగి రాకుండా అక్కడే ఉంటున్న వారికి పోలీసులు లుక్‌అవుట్‌నోటీసులు జారీ చేసి కోర్టు ద్వారా నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీచేస్తున్నారు. ఈ సమాచారాన్ని విదేశాంగశాఖకు పంపి వారి పాస్‌పోర్టులు రద్దయ్యేట్లు చేస్తున్నారు. ఇలాంటివి 2018లో 118, 2019లో జూన్ వరకు 77 కేసులు వచ్చినట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. పాస్‌పోర్టు రద్దుతో చాలా కేసుల్లో ఎన్నారై నిందితులు దారిలోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: