వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పీఠం అధిరోహించి నాలుగు నెలలు దాటింది. ఈ నాలుగు నెలల కాలంలో అనేక సంచలన నిర్ణయాలు, సరికొత్త ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. అయితే కొన్ని పథకాలు అమలు చేసే నిర్ణయం వెనుక జగన్ పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు అర్ధమవుతుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని టార్గెట్ చేసుకునే జగన్ ఆ పథకాలని అమలు చేసినట్లు తెలుస్తోంది. ఆ పథకాల వల్ల ప్రజలకు మంచి జరగడంతో పాటు, పార్టీకి లబ్ది చేకూరడం ఖాయంగా కనిపిస్తోంది.


ఈ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి త్వరలోనే ఎన్నికలని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ముందు నుంచి పంచాయితీల్లో ఓటర్లని ఆకర్షించే విధంగా పథకాలు అమలు చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పేరుతో నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. తాజాగా, ఆటో డ్రైవర్లకు రూ. 10 వేల సాయం చేశారు. ఇక ఎలాగో పెన్షన్లు ఇస్తున్నారు.


అలాగే డ్వాక్రా మహిళకు రుణాలు మజూరు చేశారు. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇలా తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే తమను గట్టెక్కిస్తాయని, ప్రతిపక్షాలకు మరో గట్టి షాక్ ఇస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మాదిరిగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దెబ్బతో టీడీపీ మరో నాలుగేళ్ళు నాలుగేళ్ల వరకు కోలుకునే పరిస్థితి ఉండకూడదని భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ మాస్టర్ ప్లాన్ ఏ మేర సక్సెస్ అవుతుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: