మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదైంది. అయితే మొదటి రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్త కేసు మాత్రం తెలంగాణలో నమోదైంది.


హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామపై కేసు నమోదు అయ్యింది. తన విధులకు ఆటంకం కలిగించాడని ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే రెండు కేసులలో తప్పించుకుని తిరుగుతున్న భార్గవరామను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ ఎస్సై గచ్చిబౌలి వచ్చారు.


సోమవారం గచ్చిబౌలిలో కారు డ్రైవ్ చేస్తున్న భార్గవ రామను అపేందుకు ఆళ్లగడ్డ ఎస్‌ఐరమేశ్ కుమార్ ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో భార్గవ రామ కారు ఆపినట్లే ఆపి తమపైకి పోనిచ్చాడని ఎస్ఐ రమేశ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకపరచడంతోపాటు కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని భార్గవిరామపై ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు.


ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 353, 336 కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పాత కేసుల విషయానికి వస్తే.. తన వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో భార్గవరామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డికి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40 శాతం వాటా ఉంది.


వ్యాపార లావాదేవీల్లో భేదాభిప్రాయాలు రావడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం చేశారని శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవరామ్‌తో పాటు మరో 10 మందిపై ఆళ్లగడ్డ ఎస్ఐ రమేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా .


మరింత సమాచారం తెలుసుకోండి: