హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటు అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ల మ‌ధ్య అనూహ్య‌మైన ఎత్తుగ‌డ‌ల‌కు కేంద్రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా...టీఆర్ఎస్ త‌న అస్త్రాల‌ను సిద్ధం చేస్తోంది. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉపఎన్నికల ఇం చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తున్నారు. ఇప్పటికే  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూర్‌నగర్‌లో చేపట్టిన రోడ్‌షో విజయవంతం కావడంతో పార్టీ త‌దుప‌రి వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, కేటీఆర్ పర్యటన తేదీలు ఒకట్రెండురోజుల్లో ఖరారు కానున్నాయి. 


ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మెజార్టీ స్థానాలను గెలిచిన టీఆర్‌ఎస్.. వివిధ పార్టీల నుంచి గెలిచిన ఇత‌ర నేత‌ల‌కు గాలం వేస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌ల్లో 80శాతం మందికిపై గా టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉండ‌గా...మిగ‌తా వారికి సైతం పార్టీ కండువా క‌ప్పుతోంది. దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు, ఉత్తమ్‌కు అండగా నిలిచిన ఆ పార్టీ నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు గులాబీ పార్టీ చెంతన చేరుతున్నా రు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రచారంలో హోరెత్తిస్తోంది. 


మ‌రోవైపు, టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు నియోజ‌కవ‌ర్గంలో మోహ‌రించారు.  మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ప్రచారం నిర్వహించారు. ముఖ్యకార్యకర్తల సమావేశం, ఇంటింటి ప్రచారంలో శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్‌ పాల్గొన్నారు. కాగా, ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి రెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉండ‌గా....ఆమెకు మ‌ద్ద‌తుగా ప్ర‌చారానికి కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ రాని సంగ‌తి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: