ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ వ్యూహాలను చిత్తు చేస్తోంది కమలం పార్టీ. జగన్ కి తమ అవసరం ఉంది కానీ తమకు జగన్ అవసరం అసలు లేదని కచ్చితంగా చెప్పేస్తోంది. ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటే కేంద్రమే దిక్కు అన్నట్లుగా ఆ పార్టీ  కఠిన వైఖరి కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచాక ఇక బీజేపీ లాంటి పార్టీ దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతున్నాయి.


ఈ నేపధ్యంలో రాష్ట్రాలను, వాటి అధికారాలను గుర్తించడం ఏనాడో కేంద్రంలోకి పెద్దలు మానుకున్నారు. మేమే పెద్దన్నలమని చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 15న నెల్లూరులో వైఎస్సార్ రైతు భరోసా పధకం ప్రారంభానికి ప్రధాని మోడీని జగన్ ఆహ్వానించారు. అయితే దానికి వస్తానని కానీ రానని కానీ మోడీ ఎక్కడా చెప్పలేదు. అయితే ఏపీలో బీజేపీ నేతల తీరు చూసినా టీడీపీ నాయకుల మాటలు చూసినా కూడా మోడీ రారు అన్నది అర్ధమైపోతోంది.


మరో వైపు ఏపీలో జగన్ని గద్దె నించి దింపాలన్న ఏకైక లక్ష్యంతో  టీడీపీ అనుకూల మీడియా గట్టిగా పనిచేస్తోంది. ఓ మీడియాకు చెందిన అధిపతి ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరీ  బీజేపీ అధినేత అమిత్ షాను కలసి వచ్చారు. ఆ ఫోటోలను కూడా తన పత్రికలో అచ్చేసుకుని తాను ఏపీ రాజకీయ విషయాల గురించి చర్చించానని కూడా చెప్పుకున్నారు. 


మరి ఇంతలా జగన్ వ్యతిరేకులంతా కలసి పనిచేస్తున్న వేళ మోడీ ఏపీకి వస్తారన్నది ఉత్త మాటేనని అంటున్నారు. ఆ సంగతి జగన్ కి కూడా తెలుసు అని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రాన్ని, ప్రధానిని గౌరవించాలన్నది జగన్ విధానమని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన తాను చేయాల్సిన పని చేశారని చెబుతున్నారు.


ఇక మరో వైపు బీజేపీ, టీడీపీలను కలపాలని చూస్తున్న వర్గాలు కూడా మోడీ రాకుండా తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మోడీ ఏపీ విషయంలో కానీ,  జగన్ విషయంలో కానీ సానుకూలత, వ్యతిరేకత రెండూ ఇప్పటికైతే వ్యక్తం చేయని సంగతి తెలిసిందే. మరి ముందు ముందు రాజకీయ కారణాల వల్ల  జగన్ని దూరం పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: