ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మేధావులకు తమిళ సూపర్ స్టార్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతు పలికారు. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసిన వారిపై కేసు నమోదు చేయడం పై కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చెబుతున్నదానికి, ప్రస్తుతం ఆయన చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నారు. ఒక పౌరుడిగా ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. 49 మంది ప్రముఖులపై కేసు నమోదు చేయడం మోదీ ఆశయాలకు విరుద్దమని కమల్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా తీర్పు ఇచ్చి.. ప్రముఖులపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరారు. మూకదాడులపై మణిరత్నం, రామచంద్ర గుహతో పాటు 49 మంది ప్రముఖులు మోదీకి లేఖ రాశారు. దీనిపై బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో వీరిపై కేసు నమోదైంది. రాజద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు బీహార్ పోలీసులు తెలిపారు.


దేశంలోని ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీల పై జరుగుతున్న మూకదాడులకు అడ్డుకట్ట వేయాలని కొద్ది నెలల క్రితం.. పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు కలిసి ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2009 జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 మధ్యలో మతాల గుర్తింపు ఆధారంగా మొత్తం 254 నేరాలు నమోదైట్లు లేఖలో తెలిపారు. వీరిలో 91 మందిని హత్య చేశారని, 579 మంది గాయపడ్డారని వివరించారు. అయితే లేఖలో వివరించిన అంశాల ప్రకారం మొదటిసారి మోదీ అధికారంలోకి వచ్చినప్పుడే మూకదాడుల కేసులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. దాడులు జరిగినప్పుడు మాత్రమే మోదీ స్పందిస్తున్నారని.. దాడులకు పాల్పడి తప్పించుకు తిరుగున్న వారిని శిక్షించకుండా వదిలేస్తున్నారని లేఖలో తెలిపారు. కాగా, దీనిపై సుప్రీం కోర్టు న్యాయం చేస్తుందని ఆయన ఆశిస్తున్నానన్నారు. కమల్ తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా దీనిపై స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: