కార్మికుల సమ్మె మొదలై  ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు వరకు ప్రభుత్వం చర్చల మీద చర్చలు జరుపుతుంది కానీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సరైన నిర్ణయం తీసుకోలేదు. అటు ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ అయితే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ పై కెసిఆర్ నిరంకుశ తీరును నిరసిస్తూ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఎన్నో విమర్శలు గుప్పించారు. 

 

 

 

 

 

 ఇక ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేటీఆర్ కేసీఆర్ లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసిఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదా  అంటూ ప్రశ్నించారు  పొన్నం ప్రభాకర్. కేసిఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని  సమ్మె నిర్వహిస్తున్న  50,000 మంది కార్మికుల బాధ మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని కేసిఆర్... కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తూ నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 

 

 

 

 

 ఆర్టీసీ సమ్మె పై కేసిఆర్ తీరు మారకపోతే ప్రజల దృష్టిలో కేసీఆర్ ద్రోహిగా  మారిపోతారని... ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉంటుందని సమస్య పరిష్కారమయ్యే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలను నెరవేర్చని కెసిఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాదు కల్వకుంట్ల కోతల  రావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు పొన్నం. ఇక అవసరం లేని వాటిపై కూడా ట్విట్టర్ ఖాతాలో స్పందించే కేటీఆర్ ... ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ కూడా కల్వకుంట్ల తారక రామారావు కాదని... కల్వకుంట్ల ట్విట్టర్ అని ఎద్దేవా చేశారు పొన్నం ప్రభాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: