ఉభయసభలు ఆమోదించిన కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులందరూ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ బిల్లుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ సభలో వివరించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో, పట్టణాల్లో ఆరు వేరు వేరు చట్టాలు అమలులో ఉన్నాయని ఈ చట్టాలన్నీ చాలా పురాతనమైనవని మరియు చాలా సంవత్సరాల క్రితం చేసిన చట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు. చట్టాల్లో ఉన్న కొన్ని లోపాల వలన ఎన్ని బిల్లులు, చట్టాలు అమలులోకి వచ్చినా ఆ చట్టాల కార్యాచరణ సక్రమంగా సాగడం లేదని అన్నారు. చట్టాల్లో ఉన్న లోపాల వలన పట్టణ ప్రణాళిక అనుకున్న విధంగా ముందుకు సాగటం లేదని చెప్పారు. 
 
గతంలో ఉన్న ఆరు చట్టాలు ఆ సందర్భాలలో ఆ పరిస్థితులకు తగ్గట్లు రూపొందించారు. నేటి పరిస్థితులకు ఆ చట్టాలకు పొంతన లేదని అన్నారు. పట్టణీకరణ మారిందని, జనాభా పెరిగిందని, ప్రజల అవసరాలకు మరియు పరిస్థితులకు తగినట్లు కొత్త మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టామని అన్నారు. ఈ మున్సిపల్ చట్టం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం పారదర్శకమైన విధానాలను , అనుమతులను తీసుకొనిరావటమే అని అన్నారు. 
 
ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయటమే పురపాలన అని, పౌరుడే పురపాలనలో కేంద్ర బిందువు కావాలనే మంచి ఉద్ధేశ్యంతో సిటిజన్ ఫ్రెండ్లీ అర్బన్ పాలనను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. పట్టణ మరియు నగర పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయటం, పూర్తి పాలనను పారదర్శకంగా ఉండేలా చూసుకోవడం, అనుమతులు త్వరితగతిన ఇవ్వటం, అవినీతికి ఆస్కారం లేకుండా చేయటం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్ధేశ్యమని కేటీయార్ చెప్పారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: