పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) నుంచి జమ్ము కశ్మీర్‌ మినహా ఇతర రాష్ట్రాలకు వలస వచ్చిన 5300 కుటుంబాలను జమ్ము కశ్మీర్‌ నిర్వాసితుల జాబితాలో చేర్చి వారికి ₹ 5.50 లక్షల పరిహారం ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజ్‌ కింద అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. 1948 లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలసవచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5300 కుటుంబాలపై కేంద్ర కేబినెట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరంతా జమ్మూ కశ్మీర్‌ కి బయటి రాష్ట్రాల్లో స్థిరపడడంతో "జమ్మూ కశ్మీర్ స్థానచలన జాబితా" లో చోటు దక్కించు కోలేదు. వీరిని తాజాగా ఈ లబ్దిదారుల జాబితాలో చేర్చి చారిత్రక తప్పిదాన్ని సరిచేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

 

జమ్ముకశ్మీర్‌ అభివృద్ధికోసం ప్రకటించిన ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్‌ను కశ్మీర్‌లో పలుప్రాజెక్టుల అమలుకు వెచ్చిస్తున్నసంగతి తెలిసిందే. ఈ ప్యాకేజ్‌ కింద పీఓకే నుంచి వలసవచ్చిన కుటుంబాలకు ప్రభుత్వం ₹ 5.50 లక్షల పరిహారం సమకూరుస్తోంది. కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి జవదేకర్‌ ఈ విషయం వెల్లడించారు.

 

తాజాగా ప్రకటించిన పరిహారాన్ని ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద అందజేయనున్నారు. జమ్మూకశ్మీర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడంతో పాటు, సరిహద్దు రాష్ట్రంలోని లబ్దిదారు లకు పలు పథకాల్లో పరిహారం ఇచ్చేందుకు ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీని కేంద్రం ఏర్పాటు చేసింది. కాగా ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, "పీవోకే నుంచి స్థాన చలనం పొంది, జమ్మూ కశ్మీర్‌కి బయటి రాష్ట్రాల్లో స్ధిరపడి, మళ్లీ తిరిగి రాష్ట్రానికి వచ్చిన 5300 కుటుంబాలకు కూడా ₹.5.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిరాశ్రయులైన కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరుగుతుంది" అని జవదేకర్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి రెండు నెలలు కావస్తున్న సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, దాన్ని తిరిగి భారత్ లో కలపడమే తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ దిశగా భారత్ కార్యచరణను మొదలుపెట్టినట్టే కనపడుతోంది. ఇందులో భాగంగా పీవోకే ప్రజలంతా భారతీయులేనని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ప్రపంచ దేశాలకు వెళ్లేలా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: