ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణలో తమ డిమాండ్లని నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ మొండిగా ముదుకెళుతున్నారు. కార్మికుల డిమాండ్లని పట్టించుకోకుండా వారిని ఉద్యోగాల నుండి కూడా తొలగించేసి కొత్త ఉద్యోగులని నియమించాలని చూస్తున్నారు.


సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఈ డిమాండ్ పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేసారు. అయితే సాంకేతిక అభ్యంతరాల కారణంగా తొలుత ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలోని ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు.


అయితే ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలని తెలంగాణ కార్మికులు కేసీఆర్ ని కోరుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అఖిలపక్ష భేటీ జరిగింది. ఆ భేటీలో ప్రతిపక్షాలన్నీ ఏపీ సీఎం జగన్ ని పొగడ్తలతో ముంచెత్తి...కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి కేసీఆర్‌ ఎంతో కొంత నేర్చుకోవాలని సూచించారు. కేవలం ఈ విషయంలోనే కాదు గతంలో పార్టీ మారే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసే రావాలని చెప్పడం, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని రివర్స్ టెండరింగ్ కు వెళ్ళి ప్రజా ధనాన్ని ఆదా చేసే విషయంలో కేసీఆర్ జగన్ చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ చురకలంటించింది.


మొత్తానికి జగన్ నిర్ణయాలు వల్ల కేసీఆర్ నానా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. దీని వల్ల భవిష్యత్ లో టీఆర్ఎస్ కు నష్టం కలిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై కూడా  ప్రభావం చూపొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: