ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల రూపాయలు దాటిన విలువైన పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కొరకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 2020 జనవరి 1వ తేదీ నుండి ఈ తరహా విధానం అమలులోకి రావాలని చెప్పారు. నిన్న సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
అధికారులు ప్రభుత్వ పరంగా పనులు, సర్వీసుల కొనుగోళ్లలో ఒకే రీతి విధానం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పనులు, సర్వీసుల కొనుగోళ్లలో ఒక్కో శాఖ ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అధికారులు ఇ-ప్రొక్యూర్ మెంట్ కొరకు ఉన్న పోర్టల్ ను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించటం లేదని కూడా సీఎం దృష్టికి తెచ్చారు. సీఎం జగన్ అధికారులతో 10 లక్షల రూపాయల నుండి 100 కోట్ల రూపాయల లోపు ప్రభుత్వ కొనుగోళ్లు, సర్వీసుల జాబితా తయారు చేయాలని చెప్పారు. 
 
జాబితా తయారు చేసిన తరువాత సర్వీసులు, కొనుగోళ్ల విషయంలో ఒక విధానాన్ని తీసుకురావాలని సీఎం చెప్పారు. అధికారులు శాఖల వారీగా వివరాలు సేకరిస్తున్నామని మరియు సంబంధిత కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సీఎం అధికారులకు నవంబర్ 1వ తేదీ నుండి ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ ను పూర్తి స్థాయిలో వినియోగించాలని చెప్పారు. 
 
ప్రభుత్వ పనులు, సర్వీసులు మరియు కాంట్రాక్టుల్లో పారదర్శకత తీసుకొచ్చే విధంగా ఒక విధానం ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కువమంది ఈ విధానంలో టెండర్లలో పాల్గొనే విధంగా ఉండాలని చెప్పారు. టెండర్లలోని అంశాలు అందరికీ అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ఇ-ప్రొక్యూర్ మెంట్ సైట్ లో వారం రోజుల పాటు తక్కువ ధరకు కోట్ చేసిన టెండర్ వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలని సీఎం చెప్పారు. ఆ తరువాత రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం అధికారులకు చెప్పారు. జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని ఎక్కువ మంది పోటీలో పాల్గొనే విధంగా ప్యాకేజీలు ఉండాలని సీఎం అధికారులకు చెప్పారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: