చంద్రబాబుకు ఇపుడు ఎక్కడ లేని దిగులు పట్టుకుంది. పార్టీ ఎటు పోతుంతో, ఏమైపోతుందోనన్న కంగారు బాబుని కుదురుగా ఉండనీయడం లేదు. ఎన్నికలు జరిగిన తరువాత ఒక్కోక్కరుగా సీనియర్లు టీడీపీని వీడిపోతున్నారు. దాంతో ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు జిల్లా టూర్లకు పని చెప్పారు. మొదట తూర్పు తిరిగారు. కాకినాడలో రెండు రోజుల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు, అయితే సీనియర్లు డుమ్మా కొట్టడం, ఏకంగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైకిల్ దిగిపోవడం జరిగిపోయాయి.


ఇక విశాఖ జిల్లా టూర్ కు ఇపుడు బాబు రెడీ అయ్యారు. ఈ రోజూ రేపూ రెండు రోజుల పాటు ఆయన విశాఖ గడపనున్నారు. విశాఖలోని పార్టీ ఆఫీసులోనే బస, అక్కడే నిద్ర, భోజనం ఇలా కొత్త ఒరవడితో బాబు పార్టీకి జోష్ తీసుకురావాలనుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు  విశాఖ జిల్లాలో మొత్తానికి మొత్తం 15 అసెంబ్లీ సీట్లలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్నది కూడా సమీక్ష చేస్తారు. ఏకబిగిన సాగనున్న ఈ మొత్తం రివ్యూ కార్యక్రమానికి ఎంత మంది నాయకులు వస్తారు, మరెంతమంది డుమ్మా కొడతారు అన్నది చూడాలి. ఇదిలా ఉండగా విశాఖ టూర్ కి వస్తున్న బాబుకు బిగ్ రిలీఫ్ ని ఇచ్చారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. తాను టీడీపీలో ఉంటున్నట్లుగా ఆయన చెప్పకనే చెప్పారు. పార్టీకి సంబంధించిన స్వాగత ఏర్పాట్లు గంటా  బ్యాచ్ చేస్తోంది.


మరో వైపు పార్టీలో కుమ్ములాటలు తారస్థాయిలో ఉన్నాయి. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి, విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ రహమాన్ కి పడడంలేదు, ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పడకేసింది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా అంతా కామ్ గా ఉన్నారు.  వీరిని పార్టీ దారి పట్టించి రీచార్జ్ ఎలా చేస్తారో చూడాలి. అలాగే పార్టీకి బాబు మార్క్ రిపేర్లు ఎంతవరకూ పనిచేస్తాయో కూడా చూడాలి. మొత్తానికి ఎన్నికల్లొ ఓటమి తరువాత తొలిసారి విశాఖ వస్తున్న చంద్రబాబుకు ఘనంగానే స్వాగత సత్కారాలు లభించాయని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: