కెసియార్ వ్యవహారం చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. ఆర్టీసీ, విద్యుత్ సంస్ధల్లోని యూనియన్లు చాలా పవర్ ఫుల్లు అన్న విషయం చాలామందికి తెలిసిందే. పై రెండు సంస్ధల్లోని యూనియన్లు సమ్మె అనగానే దాని ప్రభావం పడేది ముందుగా సామాన్య జనాల మీదే. ఇపుడు ఆర్టీసీ లో వారం రోజులుగా జరుగుతున్న సమ్మె ప్రభావం కూడా సామాన్య జనాల మీద తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.

 

అసలే ఆర్దికంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన కెసియార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలోను, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో ఆర్టీసీ కార్మికుల మద్దతు కోసం కెసియార్ చాలా హామీలనే గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ దూరం పెట్టేశారు.  అసలు ఆర్టీసిని పట్టించుకోవటమే మానేయటంతో కార్మిక సంఘాలకు మండిపోయింది.

 

అప్పట్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా కెసియార్ ఇపుడు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదంటున్నారు. అదే సమయంలో ప్రైవేటుపరం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి అనేక సమస్యలే చిలికి చిలికి గాలివాన లాగ తయారై చివరకు కార్మికులను సమ్మకు ఉసిగొల్పింది.

 

దాదాపు వారం రోజులుగా రాష్ట్రంలో ఒక్క బస్సు కూడా రోడ్డుపై తిరగలేదు. దాంతో జనాల అవస్తలు మామూలుగా లేదు. అయినా కెసియార్ ఇదేమీ పట్టనట్లే వ్యవహరిస్తుండటంతో జనాలు కూడా మండిపోతున్నారు.

 

విచిత్రమేమిటంటే సరిగ్గా నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముందు కెసియార్ ఆర్టీసీతో తల గోక్కుంటున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 48 వేలమందున్నారు. వీళ్ళల్లో హుజూర్ నగర్ లో ఉంటున్న వారు కూడా ఉండేవుంటారు. వీళ్ళంతా టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేస్తే అంతే సంగతులు. ఈ విషయం తెలిసి కూడా ఆర్టీసీ యూనియన్లతో  గొడవ పెట్టుకున్నారంటే కెసియార్ వ్యూహం ఏమయ్యుంటుందబ్బా ?


మరింత సమాచారం తెలుసుకోండి: