పగటి సమయంలో కూలీ పనులు చేసుకుంటూ రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆలయాలను టార్గెట్ చేసి దొంగతనాలు చేసే ఈ ముఠా గుట్టు ఎల్బీనగర్ పోలీసులు రట్టు చేశారు.


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి నుంచి వచ్చిన ఈ ముఠా రెండు నెలల క్రితం నగరంలోని ఎల్బీనగర్ సమీపంలోని భరత్ నగరకు వచ్చి అద్దెకు దిగింది. కొన్ని రోజులపాటు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆ పని చేస్తూనే దగ్గరలోని ఆలయాలపై దృష్టినిసారించారు. పగలు పని చేసుకోవడం.. రాత్రిళ్లు దొంగతనానికి స్కెచ్ వేయడం ఇదీ వీరి పని.


మొత్తం మీద.. గత నెలరోజుల్లో 6చోట్ల చోరీ చేశారు. ఎన్టీఆర్‌నగర్‌లోని దుర్గామల్లికార్జునస్వామి ఆలయం, మన్సూరాబాద్ సాయినగర్ లోని దుర్గా దేవి ఆలయంతో పాటు సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయం, శ్లోక పాఠశాల సమీపంలోని పోచమ్మ దేవాలయం, బండ్లగూడలోని పోచమ్మ ఆలయం, సిరినగలోని శివాలయంలో చోరీ చేశారు.


ఉప్పల్లో ఓ బైకు చోరీచేశారు. అదే బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తూ ఎల్బీనగర్ సమీపంలో మఫ్టీలో నిఘా ఉంచిన పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల వద్ద రూ.6వేలు నగదు, నకిలీబంగారు పుస్తెలు, హారం, ఓ బైకు స్వాధీనం చేసుకున్నారు. వీరి గురించి ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.


ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలోని తుమ్మలనగర్ చెందిన పేరాల నర్సింహ, మాదకం రమేష్ , రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుండి జగదీష్ , పినపాక గ్రామానికి చెందిన పెడియాల సారయ్య ఈ ముఠా సభ్యులు వీరికి దొంగతనాలు కొత్త కాదు.. గతంలో ఖమ్మం , భద్రాచలం సమీపంలోని మురుగంపాడు, కుకునూరు రాణాల పరిధిలో ఆలయాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: