ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్‌ కంటివెలుగు పథకం కొత్తసీసాలో పాతసారా మాదిరి ఉందని, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రారంభించిన 'ముఖ్యమంత్రి ఐక్లినిక్‌' పథకానికి డమ్మీలా కంటివెలుగు పథకముందని టీడీపీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఎద్దేవాచేశారు.  ప్రభుత్వం ఆర్భాటంగా అనంతపురం జిల్లాలో ప్రారంభించిన పథకానికి సంబంధించి జారీచేసిన జీవోలో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు జారీచేసిందన్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ తతంగంలో వైద్యులను ఎందుకు భాగస్వాము లను చేయలేదో, వారితో పనిలేకుండా కంటితుడుపుచర్యగా కంటివెలుగు పథకాన్ని నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వముందని ఎమ్మెల్సీ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కేవలం ప్రచార ఆర్భాటానికే దీన్ని పరిమితం చేయనున్నట్లు ఆయన చెప్పారు. సహజంగా పోషాకాహారలోపంతో చిన్నారుల్లో కంటి సమస్యలువస్తుంటాయని, అలానే గిరిజనప్రాంతాల్లోని వారు సరైన ఆహారంలేక కంటి సమస్యలు ఎదుర్కొంటుంటారని, చిన్నారులకు, గిరిజనులకు మంచిపౌష్టికాహారం అందించకుండా వారికళ్లుపోయాక కంటివెలుగు పథకంద్వారా ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందా అని శ్రీనివాసులు ఎద్దేవాచేశారు.


ఫిబ్రవరి-1, 2018న చంద్రబాబుగారు ఈ-ఐక్లినిక్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించి, 67లక్షల మందికి కంటిపరీక్షలునిర్వహించి,  6.21లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసిన విషయాన్ని వైసీపీప్రభుత్వం తెలుసుకోవాల న్నారు. వైసీపీ పాలనలో విద్యుత్‌కోతల వల్ల రాష్ట్రమంతా చీకట్లు అలముకొన్నవేళ, ఇసుక దొరక్క రోజువారీకూలీలు, నిర్మాణరంగం పనివారు పస్తులుంటుంటే పట్టించుకోవడం మానేసిన పాలకులు రాష్ట్రప్రజలజీవితాలను చీకట్లపాలుచేశారని గౌరివాని మండిపడ్డారు.    

ఇదిలా ఉంటె... ఈరోజు వైఎస్ జగన్ ఈరోజు అనంతపురంలో డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు.  ఈ పధకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని 5కోట్ల 40 లక్షల మందికి కంటివెలుగు పధకం ద్వారా కంటిపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.  మొదటివిడతగా ఏపీ లోని విద్యార్థులకు ఈ పధకాన్ని వర్తింపచేస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు.  మొత్తం 70 లక్షల మంది పిల్లలకు ఈ పధకం ద్వారా కంటిపరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  ఈరోజు నుంచి 16 వ తేదీ వరకు మొదటివిడతగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: