ఈ ప్రపంచంలో వెల కట్టలేనిది, కల్తీ కానిది, ప్రలోభాలకు అమ్ముడు పోనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే. అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. అమ్మంటే ఆప్యాయతకు మరో రూపం. నవమాసాల పంటను పురిటినొప్పులుగా భరించి ఆ బాధను నవ్వూతూ స్వీకరిస్తుంది. కంటికి నీరు రాకుండా, కాలికి ముళ్లు అంటకుండా, నిన్ను సాకుతుంది. ఆకలని నువ్వు ఏడుస్తుంటే, ఎండిపోయిన రొమ్మును నోటిలో పెట్టి నీ ఏడుపును ఆపుతుంది. చనుపాల తీపికి నువ్వూ ఊ కొడుతుంటే నీ తలపైన ప్రేమగా నిమురుతూ, మురిసిపోతుంది. పాలనుకోని ఆ తల్లి రక్తాన్ని తాగుతున్న, ఆనందంగా నిన్ను జో కొడుతూ నిద్రపుచ్చుతుంది.


నువ్వు పుట్టినప్పటి నుండి తన ఆకలి, నిద్దుర, తన ధ్యాస, తన ఆశ, నువ్వుగా బ్రతుకుతుంది... ఓ క్షణం కళ్లముందు కనబడకుంటే తల్లడిల్లుతుంది, చివరివరకు నీ ఊపిరే తన ఊపిరిగా బ్రతికే తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం.. ఆ అమ్మ ప్రేమకు వెల ఎంతని కట్టగలం. ఇంతటి విలువగల అమ్మ ప్రేమని ఓ కర్కోటకుడు అభాసుపాలు చేసాడు. నడివీధిలో అనాధ శవంగా మార్చాడు. వివరాల్లోకి వెళ్లితే..


వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కొడుకుతో పాటు ఉండే శ్యామల అనే వృద్ధురాలిని రెండేళ్ల కిందట అతడి కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడు. విషయం తెలుసుకున్న సహృదయ వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆమెను ఆశ్రమంలో చేర్చుకున్నారు. అప్పటి నుండి రెండేళ్లుగా ప్రశాంత్‌ నగర్‌లోని ఈ ఆశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న ఆమె అనారోగ్యంతో మరణించింది. ఆ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులు,కుమారుడికి తెలియచేసారు. కానీ, ఆ కఠినాత్ముడు, తల్లికి అంతిమ సంస్కారాలు చేయకపోగా.. అంత్య క్రియలకు కూడా రాలేదు. దీంతో చేసేదేం లేక ఆ ఆశ్రమ నిర్వాహకులే ‘సహృదయం’తో ఆ పని పూర్తి చేశారు.


కన్నతల్లిని కడసారి చూడటానికి ఆసక్తి కనబరచని ఆ కుమారుడిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికుండగా ఏనాడూ తల్లిని పోషించలేని ఆ పాపాత్ముడు.. కనీసం అంత్యక్రియలకైనా వచ్చుంటే ఆ తల్లి ఆత్మ శాంతించేదేమో అని కంటతడి పెట్టారు. మానవత్వం మంటల్లో కాలిపోతుంటే అక్కడ నుంచి భారమైన హృదయాలతో వెళ్లిపోయారు. ఇక ఇలాంటి వారుంటే,  ప్రతి తల్లి ఆత్మ,  తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చినందుకు...ప్రాణాలు పోతున్న ఏడ్చినప్పుడల్లా  పాలుపట్టి, మరుగుకు వెళ్తే శుభ్రం చేసి, జబ్బు పడితే సేవ చేసినందుకు నువ్విచ్చే కన్నపేగు విలువ ఇదేనా అని తప్పక ఘోషిస్తుంది....

మరింత సమాచారం తెలుసుకోండి: