హైదరాబాద్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో నగరవాసులు సాధ్యమైనంత వరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ తెలియచేశారు.


బుధవారం (అక్టోబర్ 9) సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట, మాదాపూర్‌, కోఠి, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ కూడా  ఏర్పడింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. విపత్తు నిర్వహణ, అత్యవసర బృందాలను రంగంలోకి కూడా దిగినట్లు తెలిపారు. ఆయా బృందాలన్నీ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని కూడా ప్రజలకు తెలియచేశారు. వరద నీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్ తెరిచిపెట్టే ప్రయత్నం చేయవద్దని లోకేశ్ కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు కాస్త దూరంగా ఉండాలని సూచించడం కూడా జరిగింది.


ఇక  కురిసిన వర్షంతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు వాగులు పొంగి పొర్లుతున్నాయి.. కుండపోతగా వర్షం పడటంతో చాలా ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. అయితే పిడుగులు పడే అవకాశం ఉంది అని  భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన దరిమిలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ప్రజలు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: