ఏపీ రాజధాని వ్యవహరంలో గందరగోళానికి ఇప్పట్లో తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. నిపుణుల కమిటీ స్పష్టత ఇవ్వడానికి.. మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రాజధానితో పాటు హైకోర్టు వంటి కీలక అంశాలపైనా నిపుణుల కమిటీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీంతో సమయం తీసుకోవడం పక్కా అని తెలుస్తోంది. 


నెల రోజుల క్రితం ఏపీ రాజధాని వ్యవహరంపై రచ్చ మొదలైంది. గత ప్రభుత్వం రాజధాని పేరుతో పెద్ద ఎత్తున దోచుకుందనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడమే కాకుండా.. ప్రస్తుతమున్న రాజధాని అనువైన ప్రదేశం కాదని వాదించింది జగన్ ప్రభుత్వం. గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపైనా చర్చ జరిగేలా చేసింది. రాజధాని సహా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళికల కోసం.. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసింది ప్రభుత్వం.  


గత నెల 13వ తేదీన నియమించిన నిపుణుల కమిటీ విధి విధానాలను ఈ నెలలో ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆరు వారాల్లో  నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు.. గడువు లోగానే నివేదికలు సమర్పించాయి. కానీ రాజధాని కమిటీ మార్గదర్శకాలే ఆలస్యంగా జారీ కావడంతో.. ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఈ కమిటీ ఇచ్చే నివేదిక రాజకీయంగా.. పరిపాలనా పరంగా కీలకం కానుండటంతో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.  హైకోర్టును తమ ప్రాంతంలో పెట్టాలంటే.. తమ ప్రాంతంలో పెట్టాలని ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ లు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా బీజేపీ లాంటి పార్టీలు కూడా హైకోర్టును రాయలసీమకు తరలించాలనే డిమాండును సమర్థిస్తున్నాయి. ఈ క్రమంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చే నివేదికలో రాజధాని అంశంతోపాటు.. హైకోర్టు విషయంలోనూ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయనేది కొందరి వాదన. దీంతో కనీసం మూడు నాలుగు నెలల సమయం తర్వాత కానీ నిపుణుల కమిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే జీవోలో చెప్పిన విధంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశిస్తే మాత్రం.. సుడిగాలి పర్యటన చేసైనా కమిటీ నివేదిక ఇస్తుందనే వాదన కూడా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: