ఆర్థిక శాస్ర్తానికి సంబంధించి ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించగా భారతీయ అమెరికన్‌ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ (58), ఆయన భార్య ఎస్తేర్‌ డ్యుఫ్లోను ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం వరించింది.  పేదరిక నిర్మూలనకు వీరు చేసిన విశిష్ట పరిశోధనలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. మరో ఆర్థికవేత్త మైఖెల్‌ క్రేమర్‌తో కలిసి అభిజిత్‌, డ్యుఫ్లో సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు.  పురస్కారం కింద 9,18,000 డాలర్ల నగదు బహుమతి, బంగారు పతకం, ధ్రువీకరణ పత్రం అందించనున్నారు. నగదు బహుమతిని విజేతలకు సమానంగా అందజేస్తారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సాగించిన పరిశోధనలు పేదరికంపై పోరాటంలో మన శక్తి సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచాయని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ కొనియాడింది. ఇంత‌టి ప్ర‌ముఖుడు భార‌త్‌పై క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.


నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో అభిజిత్‌ అమెరికాలో ఒక న్యూస్‌ చానల్‌తో మాట్లాడారు. భారత ఆర్థిక పరిస్థితి దుర్బలంగా ఉన్నదని అభిజిత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత వృద్ధి గణాంకాలను పరిశీలిస్తే.. సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఐదారేళ్ల‌లో మనం కనీసం కాస్త వృద్ధినైనా చూశాం. ప్రస్తుతం ఆ భరోసా కూడా లేదు. నా కెరీర్‌లో ఇంత త్వరగా నోబెల్‌ పురస్కారాన్ని అందుకుంటానని ఊహించలేదు. గత రెండు దశాబ్దాలుగా నేను ఈ పరిశోధనలు చేస్తున్నాను. పేదరిక నిర్మూలనకు పరిష్కార మార్గాలను చూపేందుకు మేం ప్రయత్నించాం’ అని ఆయన వివరించారు. ‘బెంగాల్‌లో నా బాల్యం, టీనేజ్‌ అనుభవాలు నా పరిశోధనల తొలినాళ్లలో వివిధ అంశాలను అర్థం చేసుకునేందుకు ఎంతో దోహదపడ్డాయి’ అని చెప్పారు. 


నోబెల్‌ పురస్కారం వచ్చిందన్న వార్త వినగానే మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా.. ఆ వార్త విన్న తర్వాత తాను మళ్లీ నిద్రపోయినట్లు చెప్పారు. తాను తెల్లవారుజామునే నిద్రలేచే వ్యక్తిని కాదన్నారు. నోబెల్‌ వార్త అందరికీ తెలియడంతో వరుసగా ఫోన్లు రావడం మొదలైందని, దీంతో తాను సరిగా నిద్రపోలేదన్నారు. భార్యతో కలిసి పురస్కారానికి ఎంపికవడం ‘ప్రత్యేకమని’ పేర్కొన్నారు. నోబెల్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు దంపతులు మాత్రమే సంయుక్తంగా ఈ అవార్డును అందుకున్నారు.అభిజిత్‌, డ్యుఫ్లో ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఫ్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. క్రేమర్‌.. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థిక రంగంలో నోబెల్‌కి ఎంపికైన రెండో మహిళ, అత్యంత పిన్న వయస్కురాలు డ్యుఫ్లో కావడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: