తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయటానికి క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల పరిధిలో ఈరోజు పోలింగ్ జరిగింది. పాలకవీడు, గరిడేపల్లి, నేరేడుచర్ల, చింతలపాలెం, మేళ్లచెరువు, మఠంపల్లి, హుజూర్ నగర్ మండలాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అధికారులు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 82.23 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉండటంతో పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 28 మంది అభ్యర్థులు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేశారు. 28 మందిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా పోటీ మాత్రం నాలుగు ప్రధాన పార్టీల మధ్యే జరిగింది. 
 
బీజేపీ పార్టీ నుండి కోటా రామారావు, తెలుగుదేశం పార్టీ నుండి చావా కిరణ్మయి, కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ పద్మావతి, టీఆర్ఎస్ పార్టీ నుండి సైదిరెడ్డి పోటీ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒక పార్టీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ పార్టీలు పోటీ ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేసాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఈ రెండు పార్టీలలో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పటం అంత తేలిక కావట్లేదు. 
 
కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకత వలన గెలుస్తామని భావిస్తుండగా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయానికి కారణమవుతాయని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చారనే దానిపైనే ఏ పార్టీ విజయావకాశాలైనా ఆధారపడి ఉన్నాయని తెలుస్తోంది. 24వ తేదీన హుజూర్ నగర్ ఓట్ల లెక్కింపుతో పాటు అదేరోజు ఫలితం వెలువడనుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: