ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులు ఏర్పాటుకు మండలి గండం పొంచి ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటుకు  సూత్రప్రాయంగా ఒకే చెప్పిన జగన్ సర్కార్ , ఈ నెల 20 వతేదీన అసెంబ్లీ , 21  న మండలి సమావేశం ఏర్పాటు చేసింది . అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించుకోవడం అధికార పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ , మండలిలో మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చునని పరిశీలకులు పేర్కొంటున్నారు .

 

మండలి లో ప్రతిపక్ష టీడీపీ కి బలం ఉన్న విషయం  తెల్సిందే .  రాష్ట్రం లో మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ నాయకత్వం  తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపధ్యం లో ... ఆ పార్టీ , ఈ బిల్లును మండలిలో అడ్డుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . మండలిలో ఆధిక్యం ఉన్న టీడీపీ , మూడు రాజధానుల బిల్లు ను మరింత నిశితంగా పరిశీలించాలని సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశాలుండడంతోపాటు , బిల్లుకు సవరణలు చేసి తిరిగి అసెంబ్లీకి పంపే ఛాన్సుందని విశ్లేషిస్తున్నారు . అప్పుడు  అసెంబ్లీ ఈ బిల్లును    ఆమోదించి మరోసారి మండలికి పంపాల్సి ఉంటుందని చెప్పారు . అప్పుడు కూడా మండలిలో ఆధిక్యం ఉన్న టీడీపీ నిర్ణయం తీసుకోవడానికి నెల సమయం ఉంటుందని అన్నారు .

 

 కానీ రెండవ సారి కూడా  మండలి ఈ బిల్లును  తిరస్కరిస్తే మాత్రం , అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అవుతుందని వెల్లడించారు . ఇదే విషయమై మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ , మండలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు . మండలిలో టీడీపీ అనుసరించే వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై వీరు  చర్చించినట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: