బెజవాడ బెబ్బులిగా ఒకప్పుడు రాజకీయాలు చేసిన వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధాకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండు ఎన్నికల్లో తీవ్రంగా ఓటమిని చవిచూసిన ఆయన వచ్చే ఎన్నికలపై చాలా ఆశలే పెట్టుకున్నారు. వచ్చే ఎన్ని కల్లోనూ గెలవకపోతే.. రాజకీయంగా ఆయన కనుమరుగైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అంటున్నారు. అయితే, ఇంతలోనే ఆయనపై ఉరుములు లేని పిడుగులా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ అధినేత జగన్ తీసుకున్నారని అంటున్న నిర్ణయం మరింత కలవర పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం(ఇక్కడ క్లాస్, మాస్ పీపుల్ కలయిక ఎక్కువ. పైగా వంగవీటికి సానుకూల పవనాలు ఉన్న జనాభా ఎక్కువగా ఉన్నారు) నుంచి పోటీ చేసి విజయం సాధించాలని రాధా నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ఆయన ప్రిపేర్ చేసుకున్నారు.