ప్రఖ్యాత సినీనటి, ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలు రోజాపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించినందుకుగానూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు పట్టించుకోక పోవడంతో ఆమె రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
వైసిపి ఎమ్మెల్యే ఆర్కే రోజా - తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోడె ప్రసాద్‌పై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఆగస్టు లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా నేడు రోజా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. విచారణ జరిపిన హైకోర్టు బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణలో రోజా తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
అయితే ఈ ఏడాది జూలై లో జరిగిన ఒక కార్యక్రమంలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ, తనపై రోజా చేస్తున్న పిచ్చి విమర్శలను ప్రజలు నమ్మరని అన్నారు. అంతటితో ఆగకుండా అదే రోజాను తాను ఒక వ్యభిచారి, బ్రోతల్ హౌస్ నడుపుతుందని అంటే కచ్చితంగా నమ్మేస్తారని అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడిన విషయం తెలిసిందే.