బాబ్లి వివాదానికి సంబంధించి చంద్రబాబునాయుడు 24 గంటల్లోనే తోకముడిచారు. మంగళవారం ముఖ్య నేతలతో మాట్లాడుతూ ధర్మాబాద్ కోర్టుకు వ్యక్తిగతంగా తానే హాజరవ్వాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇంతలోనే వ్యూహాన్ని మార్చేసుకుని కేవలం లాయర్ ను పంపితే చాలని ప్రభుత్వం నిర్ణయించటం గమనార్హం. 2010లో మహారాష్ట్రలోని బాబ్లి ప్రాజెక్టు సైట్లోకి ఎటువంటి అనుమతులు లేకుండానే చంద్రబాబు అండ్ కో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడి పోలీసులు చెత్తకొట్టుడు కొట్టారు. తర్వాత అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేశారు.
దాదాపు ఎనిమేదళ్ళ తర్వాత అదే కేసులో చంద్రబాబుతో పాటు మరో 16 మందికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ అవ్వటం సంచలనంగా మారింది. అసలు నోటీసులే ఇవ్వకుండా ఏకంగా అరెస్టు వారెంటు ఎలా జారీ చేస్తారంటూ మంత్రులు, టిడిపి నేతలు మండిపడుతున్నారు. అయితే, గతంలోనే కోర్టు నుండి నోటీసులు అందాయని తర్వాత బయటపడటంతో అందరూ నోళ్ళు మూసేశారు.
విషయం ఏమిటంటే, ఈనెల 22న చంద్రబాబు అమెరికాకు వెళుతున్నారు. 21వ తేదీన కోర్టుకు హాజరవ్వాలి. అక్కడేదైనా జరగరానిది జరిగితే అమెరికా పర్యటన ఇబ్బందుల్లో పడుతుందని టిడిపి మంత్రులు, నేతలు చంద్రబాబుకు సూచించారు. అయినా సరే తానే వ్యక్తిగతంగా హాజరవుతానని చెప్పారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో ? చంద్రబాబుకు బదులుగా న్యాయవాది హాజరవుతారంటూ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇక్కడ చంద్రబాబు వేరు ప్రభుత్వం వేరనే కలరింగ్ ఇస్తున్నారు.