అవును! ఏపీ రాజకీయాల్లో లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్టుగా వ్యవహరిస్తున్నారు పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభంజనం సృష్టిస్తానని ఆయన చెప్పకనే చెబుతున్నా.. ఎన్నికలకు పట్టుమని పదిమాసాలు కూడా లేకపోయినా జనసేనాని ఇంకా అభ్యర్థులపై దృష్టి పెట్టలేదు. పైగా ఇంకో మూడు మాసాలు వెయిట్ చేయాలని చూస్తున్నారనే వార్తలు తెరమీదికి వచ్చాయి. దీనికి ప్రధాన కారణం.. ఏంటనే విషయం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. పవన్ పెద్ద స్కెచ్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు విశ్లేషకులు. మరో మూడు నెలల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ఎలాగూ ఖరారు చేస్తారు. ఇప్పటికే దీనిపై ఈ రెండు పార్టీలూ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి.
ఇక, జనసేన విషయానికి వస్తే.. కొన్నాళ్ళ క్రితం జనసేన రాజకీయ వ్యవహారాల్లో ముందుకు చొచ్చుకొచ్చింది. ఇదే తరుణంలో ఆ పార్టీ నేరుగా వామపక్షాల పట్ల సానుకూలత కనబరిచింది. కొన్ని కార్యక్రమాల్లో సైతం వామపక్ష జెండాలు స్పష్టంగా ఎగిరాయి. ఒకానొక దశలో ‘వామపక్షాలు పద్ధతులు, సిద్ధాంతాలంటే ఇష్టమే. ఆ పార్టీలతో కలిసి పనిచేయాలనే భావన లేకపోలేదు. సమయం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అంటూ పవన్‌కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనసేన వెంటే వామపక్షాలు ప్రయాణిస్తున్నాయి. వామపక్షాలకు ఉన్న మీడియా సైతం పవన్‌కు సానుకూల ప్రచారానికి తోడ్పడుతూనే ఉంది.
ఇలాంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో అధికారికంగా వామపక్షాలతో జనసేన పొత్తు ఖాయమైతే ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనేదానిపైనే ఇప్పటికే తర్జనభర్జనలు సాగుతున్నాయి. ‘ఎన్నికలు జరిగేందుకు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. మాకు ఏ సీట్లు కావాలో, ఎన్ని సీట్లు కావాలో కేడర్ అభిప్రాయాలను క్రోడీకరించాల్సి ఉంది. రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ జరగడానికి ముందు ప్రజా ఆందోళనలో మావంతు కర్తవ్యాన్ని పాటిస్తూనే ఉంటాం’ అంటూ వామపక్షాల జిల్లా నాయకత్వాలు నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.
అయితే, వీరికి ఎన్ని సీట్లు దక్కినా దక్కక పోయినా... జనసేనాని మాత్రం టీడీపీ, వైసీపీల నుంచి బయటకు వచ్చే అసంతృప్తులకు అవకాశం ఇవ్వాలని వారికి ఎలాగూ ఆర్థిక బలం ఉంటుంది కాబట్టి వారిని గెలిపించుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారట. అందుకే ఆయన మరో మూడు మాసాల తర్వాత కానీ, అభ్యర్థుల వడపోతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.