వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడులో ఆందోళన పెరిగిపోతోందట. ఇంతకీ చంద్రబాబులో ఆందోళన ఎందుకు ?ఎందుకంటే పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి కారణమైన వివిధ సామాజికవర్గాల ఓట్ల బ్యాంకుల్లో చీలిక వస్తుండటమే కారణమట. అంటే పోయిన ఎన్నికల్లో చంద్రబాబు సిఎం అవ్వటానికి ఏ పరిస్దితులైతే సానుకూలమయ్యాయో అవే పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకమవుతున్నాయన్న విషయం చంద్రబాబులో కలవరానికి గురిచేస్తున్నాయి.
మోడి, పవన్ ఆయుధాలు
పోయిన ఎన్నికల్లో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యంలేని చంద్రబాబు నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ ను వెంట పెట్టుకున్నారు. మోడి వల్ల బిసి ఓటు బ్యాంకు, పవన్ వల్ల కాపుల ఓట్లలో మెజారిటీ చంద్రబాబుకు అనుకూలంగా పడ్డాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వీరిద్దరూ మద్దతుగా నిలబడినా నమ్మకం లేక ఆచరణ సాధ్యం కాని కులానికో హామీని చంద్రబాబు ఇచ్చేశారు. సరే, ఎవరి కష్టమెంతుందో స్పష్టంగా చెప్పలేకపోయినా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.
ముందు పవన్, తర్వాత బిజెపితో కటీఫ్
కొంతకాలం కాపురం చేసిన తర్వాత చంద్రబాబుతో పవన్ విభేదించారు. వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లోనూ జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నారు. తర్వాత కొంత కాలానికి బిజెపితో కూడా విడాకులు తీసేసుకున్నారు. ఇపుడీ సమస్యపైనే చంద్రబాబులో ఆందోళనలు పెరిగిపోతున్నాయట. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో పవన్ వల్ల కాపుల్లో మెజారిటీ ఓట్లు చంద్రబాబుకు పడింది. రేపటి ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేస్తానంటున్నారు కాబట్టి కాపుల ఓట్లలో ఎక్కువ భాగం జనసేనకు పడతాయనటంలో సందేహం లేదు. అంటే జనసేనకు పడే ఓట్లన్నీ చంద్రబాబుకు మైనస్ క్రిందే లెక్క.
చంద్రబాబుకు కాపు, బిసిలు దూరమేనా ?
అదే విధంగా బిసిల ఓట్లు కూడా పోయిన ఎన్నికల్లో పడినట్లు వచ్చే ఎన్నికల్లో టిడిపికి పడే అవకాశాలు లేవు. అంటే బిసి ఓట్లలో కూడా ఎంతో కొంత చంద్రబాబుకు మైనస్ అవుతాయి. దానికి అదనంగా బిజెపిని సమర్ధించే సామాజికవర్గం ఓట్లు కూడా ఎంతో కొంత టిడిపికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే వచ్చే ఎన్నికల్లో నాలుగు వైపుల నుండి ఎంతో కొత ఓట్లలో కోతపడటం ఖాయమని అర్ధమవుతోంది. వీటన్నింటికి బోనస్ గా నాలుగున్నరేళ్ళ పాలనలో వివిధ సామాజికవర్గాల్లో మొదలైన వ్యతిరేకత.
చంద్రబాబుకు ప్రత్యామ్నాయమేంటి ?
అంటే పై విషయాలేవి చంద్రబాబుకు తెలీవని అనుకోవటం లేదు. ఎన్నికల మ్యానేజ్ మెంట్లో చంద్రబాబు ధిట్టన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. దూరమైన సామాజికవర్గ ఓట్ల స్ధానంలో కొత్త ఓట్లను తెచ్చుకునే విషయంలో ఏదో వ్యూహం సిద్ధం చేసుకుంటునే ఉంటారనటంలో సందేహం అక్కర్లేదు. అందుకే సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనబడుతోంది. ఆ వ్యూహమేదో బయటపడి విరుగుడు కనిపెట్టేంత వరకూ వైసిపికి డేంజర్ సిగ్నల్స్ తప్పవు.