హోం శాఖమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చేతులెత్తేశారు. అంటే చేతులెత్తేయటం ఇపుడేమీ మంత్రికి కొత్తకాదనుకోండి అది వేరే సంగతి. హోం శాఖ మంత్రి అయిన దగ్గర నుండి అయన కేవలం ప్రోటోకాల్ కు మాత్రమే పరిమితమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకీ ఇపుడు చేతులెత్తేయటం ఎందులోనంటే అనంతపురం ప్రబోధానందస్వామి-జేసి-పోలీసుల వివాదంలో.
దాదాపు వారం రోజులుగా జిల్లాలో పై వివాదం అట్టుడుకిపోతుంటే చంద్రబాబునాయుడే ఏమీ చేయలేకపోయారు. వివాదం మొదలైన రెండు రోజుల తర్వాత తెరవెనుక నుండి చంద్రబాబు కథ నడిపించారు. అటువంటిది నిమ్మకాయల ఏం చేయగలరు ? ఇంతకీ ఆయన బాధేమిటంటే, పోలీసులపై జేసి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. అలాగే, పోలీసు సంఘం ప్రతినిధులు కూడా ఎంపిని పట్టుకుని నాలుకలు తెగ్గోస్తామని అనటం సమర్దనీయం కాదన్నారు. పైగా రాష్ట్రంలో పోలీసులు సమర్ధనీయంగా పనిచేస్తున్నట్లు కితాబు కూడా ఇచ్చారు లేండి.
అసలు ఈ మొత్తం వివాదంలో ఇటు జేసిది తప్పుంది అటు పోలీసు అధికారులది తప్పుంది. జేసి నోటి దురుసును కంట్రోల్లో పెట్టలేకపోవటం చంద్రబాబు తప్పు. బహిరంగంగా డిఎస్పీ స్ధాయి పోలీసు అధికారిని పబ్లిక్ గా అమ్మ నా బూతులు తిడితే కూడా ఎంపిగా వార్నింగ్ ఇవ్వరా ? ఎంపి అన్న మాటలకు ఒళ్ళు మండిపోయిన పోలీసు అధికారుల సంఘం రియాక్ట్ అయ్యింది. తప్పుంటే ఇద్దరిలోను ఉంది. జేసి పోలీసులను తిట్టటం తప్పే. అదే సమయంలో ఎంపిని హెచ్చరించటం పోలీసులకు కూడా తగదు. చంద్రబాబు కూడా బహిరంగంగా ఏమీ మాట్లాడని ఈ వివాదంలో హోం శాఖ మంత్రి చేతులెత్తేయటంలో వింతేముంది ?