అధికారం కొత్త కావడం.. ఎవరు స్పందించాలో తెలియకపోవడం.. మీడియా వార్తలను పెద్దగా పట్టించుకోకపోవడం వైసీపీ సర్కారుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. సరైన సమయంలో సరిగ్గా స్పందించకపోతే.. రాజకీయంగా నష్టం తప్పదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు సరిగ్గా గుర్తిస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా అన్న క్యాంటీన్ల విషయంలో ఇదే జరిగింది.


పేదవాడికి కేవలం 5 రూపాయలకు కడుపునిండా భోజనం పెట్టే పథకం అన్న క్యాంటీన్లు.. చంద్రబాబు సర్కారు ఎన్నికల ముందు చేసిన హడావిడిలో ఇదీ ఒకటి. అయితే వీటిని కొనసాగిస్తారా.. నిలిపేస్తారా.. పేరు మార్చి మళ్లీ ఓపెన్ చేస్తా అనే విషయంలో గందరగోళం తలెత్తింది.


ఓవైపు అన్న క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న అక్షయ పాత్ర గడువు ముగిసిందని.. ఒకటో తారీఖు నుంచి క్యాంటీన్ మూసేస్తారని చాలాచోట్ల నిర్వాహకులే ప్రజలకు చెప్పారు. అంటే ఇవి పూర్తిగా మూతబడతాయా.. లేక.. మళ్లీ తెరుస్తారా అన్న దానిపై అధికార వర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.


అబ్బే అన్న క్యాంటీన్లను మూసేయడం లేదని మొన్న అసెంబ్లీలో బొత్స చెప్పారు. ఇంతలోనే అన్న క్యాంటీన్లు మూతబడ్డాయి. ఇదే అదనుగా చూస్తున్న ఎల్లో మీడియా రెచ్చిపోయింది. ఇంకేముంది పేదవాడి నోట దగ్గర కూడా లాగేస్తున్నారంటూ గోల ప్రారంభించింది. ఇదంతా వైసీపీ సర్కారు వైఫల్యంగా నే చూడాలి. జనంలో ఇంత అస్పష్టత ఎందుకు ఉండాలి. ముందే క్లారిటీగా చెప్పేస్తే.. ఎల్లో మీడియాకు ఛాన్సు ఉండేది కాదు కదా..


చివరిలో విషయం గ్రహించిన మంత్రి బొత్స స్పందించారు. అన్న క్యాంటిన్లను మూసివేయడం లేదని.. లోపాలను సరిచేసి మరింత పకడ్బందిగా అమలు చేస్తామని చెప్పారు. మొత్తం క్యాంటీన్లలో 68 మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని.. మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అంటే మళ్లీ క్యాంటీన్లు తెరుస్తారన్నమాట. ఈ క్లారిటీ ఏదో ముందే ఇస్తే ఇంత గందరగోళం ఉండేది కాదు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: