అభిమాన నాయకుడిని గౌరవించుకోడవం సర్వసాధారణమే.. కానీ.. అందుకు ఎంచుకున్న మార్గాలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. సహజంగా ఓ నాయకుడు ఏదైనా పథకం ప్రవేశ పెట్టినప్పుడు దాని లబ్ది దారులంతా తమ ఆనందం ప్రకటిస్తారు.. తమ నాయకుడిపై ఆనందం వ్యక్తపరిచేందుకు కొన్ని పనులు చేస్తారు. మరి తాము సదరు నాయకుడిని గౌరవించినట్టు మీడియాలోనూ ప్రచారం రావాలి కదా. అందుకే.. నాయకుడికి జేజేలు కొడతారు.. కొందరు నినాదాలు చేస్తారు.


ఇవే కాకుండా తమ నాయకుడిపై ప్రేమతో కొందరు ర్యాలీలు తీస్తారు. ఊరేగింపులు చేసి వేడుక చేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. కృష్ణా జిల్లా నూజివీడు మునిసిపల్‌ ఆఫీసులో కొందరు సీఎం జగన్‌ పై వెరైటీగా అభిమానం చాటుకున్నారు. వారు ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోకు దండేసి పూలు జల్లి అభిమానాన్ని ప్రదర్శించారు. సాధారణంగా ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తారు.. కానీ వీళ్లు ఏకంగా దండ వేసి పూలు కూడా జల్లుతున్నారు. మన సంప్రదాయంలో ఫోటోకు దండ వేయడం ఎప్పుడో తెలుసుగా. పాపం.. వీళ్లు తెలిసి చేశారో.. తెలియక చేశారో గానీ.. వీళ్లు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సోషల్ మీడియా సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి ఓ ఫోటో ఒక్కటి తమ కంట పడితే శత్రువర్గం ఊరుకుంటుందా.. దీన్ని చిలువలు పలువలు చేసి చెడుగుడు ఆడుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇలా జగన్‌ కు దండ వేస్తున్న ఫోటోను ఉపయోగించి టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రారంభించింది. అనేక మంది మీమర్లు ఇప్పటికే తన బుర్రకు పదును పెట్టి కొత్త కొత్త మీమ్స్ తయారు చేస్తున్నారు.  


అభిమానం వెర్రితలలు వేస్తే ఇలాగే ఉంటుందేమో అనిపించే ఘటన ఇది. ఇప్పుడు ఈ ఫోటోను చూసిన వాళ్లు ఇదేం అభిమానం రా నాయనా అని విసుక్కుంటున్నారు. వీళ్ల మూర్ఖత్వానికి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: