బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ బాపినీడు జయంతి నేడు. టాలీవుడ్ లో రచయిత, దర్శకుడు, నిర్మాత. మ్యాగజైన్ ఎడిటర్‌గా తన వృత్తిని ప్రారంభించిన బాపినీడు మగ మహారాజు, ఖైదీ నెం .786, గ్యాంగ్ లీడర్, మగధీరుడు వంటి అనేక బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

దర్శకుడు విజయ బాపినీడు అసలు పేరు చాలామందికి తెలియదు. ఎందుకంటే అందరూ ఆయనకు బాపినీడు అని పిలిచేవారు. కానీ అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. అతను సెప్టెంబర్ 22, 1936న ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో సీత రామస్వామి, లీలావతి దంపతులకు జన్మించాడు. అతను సిఆర్ఆర్ కళాశాలలో (ఏలూరు)  మ్యాథ్స్ బీఏ పట్టభద్రుడయ్యాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. ఉద్యోగం చేస్తూనే ఆయన  "అపరాధ పరిశోధన" అనే ఒక మాసపత్రికలో కథలు రాసేవారు. అవి విశేషంగా ఆకట్టుకోవడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగు పెట్టే ముందు ఆయన "విజయ" అనే సినిమా పత్రికకు ఎడిటర్‌గా పని చేశారు. ఆయన బొమ్మరిల్లు, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించారు.

1982లో దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి పరిచయమైన ఆయన తన సినీ ప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా చిరంజీవి సినిమాలకే దర్శకత్వం వహించారు. చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ లో పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు,  గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు వంటి చిత్రాలు ఉన్నాయి. శోభన్ బాబుతో పాటు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన 'కొడుకులు' బాపినీడు చివరి చిత్రం.

అంతేకాకుండా రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా, భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్‌ను మాటల రచయితగా తెలుగు సినీ రంగానికి పరిచయం చేశాడు. ఆయన నిర్మించిన చిత్రం 'యవ్వనం కాటేసింది'. ఇలా ఇండస్ట్రీలో బహు ముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించిన బాపినీడును ఇండస్ట్రీ ఎప్పటికి స్మరించుకుంటూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: