శ్రీ సూక్తం లోని రెండు అమూల్యమైన శ్లోకాలను వాటి అర్ధం క్రింద నివ్వబడింది. అమ్మవారిని ఇలా మనసా వాచా కర్మణా ప్రార్ధిస్తే ఆ మహాలక్ష్మి సమస్తైస్వర్యాలను మనపై వర్షిస్తుంది.


“లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగధామేశ్వరీం!

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!

శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం!

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్తియాం!”



సమస్త ఐశ్వర్యాలకు నిలయమైన ఆలవాలమైన ఓ సముద్ర రాజ పుత్రీ! శ్రీరంగములో కొలువైవున్న ఓ దేవీ! అమరలోక స్త్రీ లందరినీ దాసదాసీ జనంగా కలిగి, లోకానికి ఒకేఒక్క దీపంగా- దీప్తివంతంగా వెలిగే నీవు- ఎవరి మృదుమధుర కటాక్షంతో బ్రహ్మ, ఇంద్రుడు  , శివుడు ఇంతటి వైభవాన్ని సంతరించుకున్నారో  మూడులోకాలను తన కుటుంబముగా చేసుకొని అందరికీ సుఖసౌఖ్యాలనిచ్చే జగన్మాతా - తామరకొలనులో ఉద్భవించి శ్రీ మహా విష్ణువుకు ప్రియమైన నీకు నమస్కారం చేస్తున్నాము.  


“యాసా పద్మాసనాస్థా విపులకటితటీ పద్మపత్రాయ తాక్షీ!  

గంభీరా వర్త నాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా!

లక్ష్మీర్ధివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్నాపితా హేమకుంభైః!

నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్య యుక్తాః!”

 

పద్మం మీద ఆశీనులై, విశాలమైన పిరుదులు, తామరరేకులవంటి నేత్రాలు, లోతైన నాభి, స్థనభారముతో వంగిన దేహం స్వచ్చమైన వలువలు ఉత్తరీయము ధతించిన రత్నాలు పొదిగిన బంగారు కలశాల జలముతో దేవలోకమందే శ్రేష్ఠతను పొందిన గజరాజు చే అభిషేకించబడుతున్న, పద్మాన్ని చేత ధరించిన సర్వమంగళ స్వరూపిణి  ఐన - ఓ మహాలక్ష్మీ నా గృహములో సర్వవేళలా నివసించమని ప్రార్ధిస్తున్నా!     


వరలక్ష్మీదేవి వ్రత కథ ఎలా వెలుగు లోకి వచ్చిందంటే? 


పూర్వం మగధ రాజ్యములో కౌండిన్య నగరము లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఎంతో ప్రేమ పాత్రంగా జీవించేది. ఆ గృహములోని అత్తా మామలకు ఎంతో ప్రేమగా సేవచేస్తూ తన పతితో అత్యంత అన్యోన్య దాంపత్యం గరపుతూ చారుమతి అనే యువతి ప్రతి నిత్యం ఆ శ్రీ మహాలక్ష్ని దేవి ని క్రమంతప్పక పూజిస్తూ ఉండేది.


ఒక నాటి రాత్రి చారుమతికి స్వప్నంలో లక్ష్మి దేవి దర్శనమిచ్చి "అమ్మ చారుమతీ నీ భక్తికి అందులోని నిభద్దతకు పరవశించాను. ఈ శ్రావణ మాస పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసపు రెండవ శుక్రవారం నా పూజ, నా వ్రతం, చేస్తే నీవు, నీ ఇల్లు, నీ భర్త, నీ కుటుంబీకులు, నీ సన్నిహితులే కాదు ఈ పట్టణం ఈ రాజ్యం కూడా సర్వ సంపదలతో తులతూగుతుంది. నీవెక్కడ అడుగెడితే అక్కడ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్ఠలు ఆ కుటుంబానికి ఆ వంశానికి సంపూర్ణంగా సిద్ధిస్తాయి" అనిచేప్పి ఆ శ్రీదేవి అధృశ్యమైంది. నిద్రనుంది మెలకువ రాగానే, మహదానందం తో చారుమతి అత్తమామలు, భర్తకు స్వప్న వృత్తాంతం చెప్పగా " ఇది ఎంతో శుభకరమైన స్వప్నం. శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని అమ్మ చెప్పినట్లు శ్రావణ శుక్రవారం రోజు శ్రీ వరలక్ష్మీ వ్రతం చేసుకుందామని అంతా సిద్ధం చేయమని చెప్పారు. 


శ్రీ మహాలక్ష్మిదేవి చెప్పిన శుక్రవారం రోజున ఇల్లంతా ఆవుపేడతో అలికి, ముగ్గులు పెట్టి నయనానందకరంగా తీర్చిదిద్ది అందరూ తమశక్తికొలది తమ కున్నంతలో శుభ్రవస్త్రాలు ధరించి పూజకు ఉపక్రమించారు. ముందుగా గణపతి పూజ, తదుపరి లక్ష్మిదేవి ఆవాహన చేసి అష్టొత్తర, షోడశోపచార ఊజలు నిర్వహించి శతనామావళి, సహస్రనామార్చనతో తో కూడిన పూజను అత్యంత భక్తి తో నిర్వహించి ఆ మహాలక్ష్మి దీవనలు అందుకున్నారు. ముత్తైదువలను పిలిచి పేరంటమిచ్చి, వరలక్ష్మీ వ్రత కథను, దాని నియమాలను, మహిమ వ్రత విధానాన్ని అందరికీ వివరించారు. అప్పటినుండి చారుమతి కుటుంబం అష్టైశ్వర్యాల తో తులతూగింది. అలాగే ఆమె ఉన్న పట్టణం రాజ్యం సర్వతోముఖ వైభవం పొంది విలసి ల్లింది. కరువు కాటకాలనేవి ఆ రాజ్యములో ఎక్కడా కనిపించలేదు.


స్త్రీలంతా వరలక్ష్మీ శుక్రవారం కోసం ప్రతి సంవత్సరం ఎదురుచూడ సాగటానికి అలవాటు పడ్డారు. మహాలక్ష్మి కూడా ఆ నగరవాసులు సర్వ సంపదలివ్వటానికి అలవాటుపదింది.


ఈ వ్రత కథను పరమేశ్వరుడు తన ప్రియ సఖి పార్వతికి వివరించినట్లు సూతమహాముని తన శిష్యులకు చెప్పగా వారు ముల్లోకాలకు ఈ వ్రత విధానం ప్రచారం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: