దేవుని క్షేత్రం అంటే అది ఎక్కడైనా కాకులు ఉండడం చూస్తూనే ఉంటాము. కానీ ఇందుకు భిన్నంగా కొన్ని క్షేత్రాలలో కాకులు ఉండవట. అయితే ఒక్కో క్షేత్రంలో కాకులు లేకపోవడానికి వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇలాంటి క్షేత్రాలు ఈ కారణం చేత మంచి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటే మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్పకొండ. గుంటూరు లో ఉన్న ఎన్నో పుణ్య క్షేత్రాలలో కోటప్పకొండ కూడా ఒకటిగా ఉంది. అయితే ఇక్కడ కాకులు తిరగకుండా ఉండడానికి కారణం ఆనందవల్లి అనే గొల్లభామ కారణమని స్థల పురాణం చెబుతోంది. పూర్వ కాలంలో ఈ కోటప్పకొండపైకి ఎల్లప్పుడూ ఆనందవల్లి అనే గొల్లభామ వచ్చేదట. ఈమె స్వతహాగా శివ భక్తురాలు.

ఈమె శివ పూజ చేసి నైవేద్యం పెట్టనిదే..ఎంగిలి కూడా చేసేది కాదట. ఆ పరమ శివుడు కూడా ప్రతి రోజూ ఆమె పూజ కోసమే ఎదురుచూస్తూ ఉండేవాడట. ఇలా ఆమె శివుడితో చాలా దగ్గరగా ఉండేదని పురాణాల్లో చెప్పబడి ఉన్నది. కొండ కింద నుండి పైకి కుండలో నీటిని తెచ్చి అభిషేకం చేసేది. అలా ఒకరోజు కుండలో నీటిని పైకి తెచ్చి అక్కడ ఉంచి, మారేడు దళాల కోసం వెళ్ళింది. అదే సమయంలో అక్కడ నీటి కోసం వచ్చిన కాకి, నీరు తాగడానికి కుండపై వాలింది. ఈ ప్రక్రియల కుండ పడిపోయి దొర్లుకుంటూ పోవడంతో నీళ్లన్నీ పోయాయి. తిరిగి వచ్చిన ఆనందవల్లి ఆ దృశ్యాన్ని చూసి, కాకిపై తీవ్ర ఆగ్రహం కలిగింది.

తాను ఎంతో భక్తితో శివుడికి చేస్తున్న పూజకు భంగం కలిగించిన కారణంగా, ఇక ఈరోజు నుండి ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదంటూ కోపంతో శపించింది. శివుడికి మహా భక్తురాలు కావడంతో తాను కోరిన విధంగానే ఆ శాపం ఫలించింది. ఈ కారణం చేతనే  కోటప్పకొండ పై మీరు చూద్దామనుకున్నా ఒక్క కాకి కూడా కనిపించదు. ఈ కథతో భక్తులు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులకు ఒక చిత్రమైన అనుభూతిని కలిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: