భారత దేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటని చెప్పుకోవచ్చు. భక్తులందరూ శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని తమ ఇంట కల్యాణంగా భావిస్తుంటారు. ఐతే మన తెలుగు ప్రజలకు శ్రీరాముడు అనగానే మొదటిగా భద్రాచలం గుర్తుకు వస్తుంది. కరోనా కారణంగా గత ఏడాది భద్రాద్రిలో శ్రీ రామ నవమి మహోత్సవ వేడుకలు అంత వైభవంగా జరగలేదు కానీ ప్రతియేటా ఇక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుతున్నారు. నిజానికి రామ భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఒక్కసారైనా పాల్గొనాలని బలంగా కోరుకుంటారు. అయితే అసలు ఇంతకీ భద్రాద్రి కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే..


స్థలపురాణం లో చెప్పిన ప్రకారము.. శ్రీరాముడు సీతమ్మ వారిని వెతుకుతున్న క్రమంలో ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారట. అనంతరం భద్రమహర్షి యొక్క ఆతిథ్యం పొందిన శ్రీరాముడు, తాను సీతమ్మ వారిని సంరక్షించిన తర్వాత, మళ్లీ తిరిగి అటువైపుగా వచ్చి పునర్దర్శనాన్ని అందచేస్తానని మాట ఇచ్చారట. కానీ రావణుడిని సంహరించి సీతను రక్షించిన పిదప శ్రీరాముడు భద్ర మహర్షి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయి ముందుకు కొనసాగారట. మరోవైపు భద్ర మహర్షి మాత్రం శ్రీరాముడు దర్శనార్థం ఎదురుచూస్తూ తపస్సు చేస్తూనే ఉన్నారట. అయితే ఇలా రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోతూనే ఉన్నాయి కానీ శ్రీరాముడు మాత్రం భద్ర మహర్షి వద్దకు రాలేదు. చివరికి రామావతారం కూడా సమాప్తి చెందింది కానీ భద్ర మహర్షి తపస్సు మాత్రం ఆగనే లేదు.



ఐతే రాముని అవతారం చాలించి విష్ణువుగా అవతారమెత్తి వైకుంఠంలో ఉన్న శ్రీరాముడికి ఓ రోజు తాను భద్ర మహర్షి కి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. దీంతో శ్రీరాముడు వెంటనే సీతను లక్ష్మణుని వెంట బెట్టుకొని పరుగుపరుగున భద్ర మహర్షి ని కలిసేందుకు బయల్దేరారు. ఐతే భద్రునికి పునర్దర్శనాన్ని అందచేసిన రాములవారు అతని కోరికను మన్నించి అక్కడే వెలిశారు. అందుకే ఆ ప్రదేశానికి భద్రాచలం అని పేరు వచ్చింది. తరువాత కాలంలో కంచర్ల గోపన్న భద్రాచలంలో దేవాలయం నిర్మించి, శ్రీరామ నవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి ఇక్కడ శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవ వేడుకలు జరపడం ఆనవాయితీగా మారింది. ఇక శ్రీ రాముని కోసం ఏళ్ళతరబడి తపస్సు చేసిన భద్రమహర్షి కారణంగా శ్రీరాముడు ఈ క్షేత్రంలో వెలిసారు కాబట్టి ఆయన పేరుతో ఈ మహా పుణ్యక్షేత్రానికి భద్రాద్రిగా పేరొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: