కాశీ.. భారత దేశంలోని హిందువులకు అత్యంత పుణ్యక్షేత్రం.. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భావించే పుణ్య క్షేత్రం.. ఈ పుణ్యక్షేత్రంలో ఒక్క విశ్వనాథుడే కాకుండా.. అనేక దేవాలయాలకు ఆలవారం ఈ పుణ్య క్షేత్రం.. పవిత్ర గంగానది తీరంలో ఉన్న ఈ కాశీకి పర్యాటకులు విశేషంగా వస్తుంటారు. అయితే.. ఈ కాశీ ఆలయాన్ని ఇప్పుడు మరింత సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి.


అందుకే ఈ పునరుద్ధరణ పనుల కోసం కాశీ విశ్వనాథ ఆలయంలో 3 రోజులపాటు దర్శనాలకు అంతరాయం కలగబోతోంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు దర్శనాలు నిలిపివేస్తూ ఆలయ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా గర్భగుడిలో పనులు జరుగుతున్నాయి. రాతి కట్టడంపై వేసిన పెయింట్ తొలగించేందుకు గ్రౌండింగ్, పాలిషింగ్ చేస్తున్నారు. నవంబర్ 29, 30 తేదీల్లో ఉదయం గం. 6.00 నుంచి సాయంత్రం గం. 6.00 వరకు దర్శనాలు నిలిపివేస్తారు.


డిసెంబర్ 1 తెల్లవారుజాము నుంచి డిసెంబర్2 ఉదయం గం. 6.00 వరకు పూర్తిగా దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో గర్భగుడి లోపలి గోడలు శుభ్రం చేస్తారు. డిసెంబర్ 13న కాశీ విశ్వనాథ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులు పూర్తిచేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. భక్తుల కోసం ముందుగానే ప్రకటన చేసిన ఆలయ యాజమాన్యం.. దీన్ని గమనించి తమ పర్యటనలను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తోంది.


కాశీ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తారు. కాశీలో అనేక తెలుగు వాళ్ల సత్రాలు ఉన్నాయి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో బస, ఆహారం ఏర్పాటు చేస్తారు. అనేక స్వచ్చంధ సంస్థలు కూడా తెలుగు వాళ్లకు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నందువల్ల మీ పర్యటన ఉంటే అందుకు అనుగుణంగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: