ఆదిలో అంతా ఉంది అంటారే!
ద్వైతంలోనూ, అద్వైతంలోనూ
అంతా తామే అంటారే!
ఇవ‌న్నీ కొలిచిన వారికి క‌లిగే సందేహాలు
ప్రార్థ‌న త‌త్వం నేర్చుకోవాలి అని కుతూహ‌లం
ఉన్న‌వారికి క‌లిగే సందేహాలు


శివ‌య్య..మ‌నిషిని మాన‌సికంగా ఉన్న‌తంగా ఉంచుతాడు.ఆర్థిక ప‌రిధిని నిర్ణ‌యించుకుని బ‌త‌క‌డంలోఉన్న ఆనందం ఒక‌టి నిర్ణ‌యిస్తాడు.ఆనందం అవ‌ధిని నిర్ణ‌యించాక‌నే జీవితం నిరాశ‌ల‌కు లొంగి ఉండ‌దు అని చెప్పి వెళ్తాడు.జాగ‌ర‌ణ‌తో కొన్నింటిని తెలుసుకోమ‌ని ఉప‌దేశ సారం అందిస్తాడు.ఇదివ‌ర‌క‌టి త‌ప్పిదాలు వ‌దులుకోవ‌డం లేదా  వ‌ద్ద‌నుకోవ‌డ‌మే త‌ర్ప‌ణం అని నేర్పివెళ్తాడు.క‌నుక శివ‌య్య అంద‌రి వాడు..ఆయ‌న ద‌గ్గ‌ర మ‌నం అంతా చిన్న‌వారం.వాడి బూడిదలోనే త‌త్వ సారం  ఉంది.
స్మ‌రించే వేళ ధార‌ణ..భ‌క్తికి మ‌రో ప్ర‌త్యామ్నాయం భ‌క్తే అని స్ఫురించే వేళ స్మ‌ర‌ణ అన్నీ శివ‌య్య ప‌రం.నిష్క‌ళంకం ఆయ‌న చెంత ఒక‌టి నిర్మాణంలో ఉంటుంది.దానిని గుర్తించ‌డమే జీవిత అవ‌ధి.

రాత్రి ని క‌రిగించాక ఉద‌యాలు..రాత్రంగా భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో కూడిన అర్చ‌న‌లు మ‌రియు ప్రార్థ‌న‌లు.శివ‌రాత్రి అంటే మ‌నిషి త‌నని తాను తెలుసుకునేందుకు కాస్త‌యినా అవ‌కాశం ఉండే రోజు అని అర్థం చేసుకోవాలి.చేసుకుంటున్నామా మ‌నం! అయ్యో! యుద్ధం అమ్మో! యుద్ధం అంటూ తెగ భ‌య‌ప‌డిపోవ‌డం త‌ప్ప‌! మ‌నిషిగా మ‌నం చేసేదేం లేదు.అన్నింటినీ క‌లుపుకుని పోవ‌డం ల‌యం.. అన్నింటికీ ప్ర‌తినిధి తానే అని చెప్ప‌డం శివం.. అహం శివం అవును! ఆ పాటి జ్ఞానం లేకుండా మ‌నుషులు ఎలా ఉంటారు. ఎందుకు అలా తమ జీవితాల‌ను వెలివేసుకుని ఉంటారు. క‌నుక శివ‌రాత్రి వేళ‌లు కొత్త జీవితాలు ఆరంభం అవుతున్నాయి అని భావించి చేసే ప్రార్థ‌నే అత్యంత ప్రీతిక‌రం కావాలి మ‌నంద‌రిలో!
 
బూడిద రాసుకుంటూ పోతే  మిగిలిన జీవితంలో కారుణ్య చింతన ఒక‌టి తోడుగా ఉంటుంద‌ని శివ‌త‌త్వం ఉప‌దేశం.అంటే ఏమీ లేని త‌నం ప్రేమించి అన్నీ ఉన్నా వాటిని త్య‌జించి జీవించ‌డంలో జీవితానికో అర్థం ఉంది.ప‌ర‌మార్థ చింత‌న ఉంది.స్వాభావిక ధోర‌ణిని శివ‌య్య చెంత ఉంచి చేసే అర్చ‌నలో ఓ గొప్ప సందేశం ఉంది. మ‌నం బాగుండ‌డం ఓ జీవ‌న విధానం లోకం బాగుకు లేదా లోకం ఉన్న‌తికి కార‌ణం  కావ‌డం అన్న‌దే ఆద‌ర్శం. విధానం అన్న‌ది మారినా ఆద‌ర్శం మాత్రం  నిత్యం అనుస‌ర‌ణీయం కావాలి. మ‌నం బాగుండ‌డం లేదా బాగుండాల‌ని త‌పించ‌డంలో స్వార్థం ఉంది.శివ‌తత్వం అయితే స్వార్థం నేర్ప‌దు. పెంచుకోమ‌ని చెప్ప‌దు. లోకం బాగుండేందుకు ఏం చేయాలి అన్న ఓ ఆలోచ‌న ద‌గ్గ‌ర వైశిష్ట్య కార‌కం అయిన శివుడు జ‌ఠాధారి అయి కాన‌గ‌వ‌స్తాడు.కైవ‌ల్య సిద్ధికి స‌హ‌క‌రిస్తాడు.కొలిచి  మొక్కిన చాలు కొండ దేవ‌ర ఆన భ‌క్తిగా నీకు క‌లుగు గాక !
 
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: