ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఓపెనర్ పృధ్వీషా అదరగొడుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో స్థానం కోల్పోయిన తరువాత కఠోర శ్రమతో తిరిగి ఫాం సంపాదించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో తన ప్రతిభను బయటపెట్టాడు. ముంబై జట్టుకు కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న పృధ్వీషా టోర్నీ ప్రారంభం నుంచే అదరగొడుతున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సత్తా చాటాడు. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 237 నాటౌట్‌గా రికార్డు డబుల్ సెంచరీ సాధించాడు. కాగా.. ఇప్పుడు ఏకంగా ధోనీ, కోహ్లీలకు సాధ్యం కాని ఓ రికార్డును సొతం చేసుకున్నాడు.

విజయ్‌ హజారే ట్రోఫీలో దిగ్గజ బ్యాట్స్‌మెన్లకు సాధ్యం కానీ రికార్డును పృధ్వీ షా సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 800 పరుగులకు పైగా నమోదు చేసిన తొలి ఆటగాడిగా పృథ్వీ రికార్డు సృష్టించాడు. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ఫైనల్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో మ్యాచ్‌లో షా ఏకంగా 39 బంతుల్లోనే  73 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే సరికొత్త ఘనత అందుకున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఏకంగా 827 పరుగులు చేసి.. 2017-18 సీజన్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 723 పరుగుల రికార్డును తాజాగా షా బ్రేక్‌ చేశాడు. పృథ్వీ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే నాలుగు శతకాలు నమోదు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్  బ్యాటింగ్ ఎంచుకుంది. తరపున మాధవ్ కౌశిక్ 156 బంతుల్లో 158 పరుగులతో అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. ఆ తరువాత సమర్థ్ సింగ్(55), అక్షదీప్ నాథ్(55) అర్థసెంచరీలతో రాణించారు. దీంతో యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 312 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబైకి పృధ్వీ సూపర్ ఓపెనింగ్ ఇచ్చాడు.

ఓపెనర్‌గా వచ్చిన పృధ్వీ భీకర ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లోనే ఏకంగా 73 పరుగులు చేశాడు. అందులో 4 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. పృధ్వీతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆదిత్య తారే 118 పరుగులతో సెంచరీతో చివరివరకు నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దీంతో 41.3 ఓవర్లలోనే ముంబై 315 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: