ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021లో భాగంగా గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ అద్భుత ప్రదర్శనతో ఓటమి అంచుల నుంచి గట్టెక్కి ఎలాగోలా విజయం సాధించింది. అయితే రాజస్థాన్ బౌలర్లు కూడా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ను ముప్పు తిప్పలు పెట్టారు. ప్రధానంగా తొలి మ్యాచ్‌లో బౌండరీలతో కదం తొక్కిన పృధ్వీ షాను ఉనద్కత్ అవుట్ చేసిన తీరు అద్భుతం. అయితే దీని వెనుక ఓ పక్కా ప్లాన్ ఉందని ఉనద్కత్ చెబుతున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే పృధ్వీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగానని తెలిపాడు.

ఇక రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. మొదటి స్పెల్‌లోలోనే మూడు ఓవర్లు వేసిన పృధ్వీ షా, శిఖర్ ధవన్, ఆజింక్య రహానేల రూపంలో తొలి మూడు వికెట్లను తీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షాను ఔట్‌ చేసేందుకు ఓ ప్లాన్‌ అమలు చేసినట్లు ఉనద్కట్‌ మ్యాచ్‌ అనంతరం వెల్లడించాడు.

'సీఎస్‌కేతో మ్యాచ్‌లో పృథ్వీ షా ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు ఆడి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. గత మ్యాచ్‌లో షా ఆడిన ఎక్కువ షాట్లు మిడ్‌వికెట్‌ రీజియన్‌ నుంచి వచ్చాయి. ప్రధానంగా స్లో బాల్స్‌ను అతడు మిడ్‌వికెట్‌ దిశగా కొట్టడానికి అతడు ఇష్టపడతాడు. దానిని దృష్టిలో ఉంచుకునే నా రెండో ఓవర్‌ ఆఖరి బంతిని స్లో బాల్‌గా వేశాను. పృథ్వీ దానిని మిడ్‌వికెట్‌ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న మిల్లర్‌ చేతికి చిక్కడంతో నా ప్లాన్‌ ఫలించింది. అలా షాను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపడంలో సక్సెస్‌ అయ్యానం’టూ ఉనత్కత్ తెలిపాడు.

కాగా.. ఢిల్లీతో మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్లు వేసిన ఉనద్కత్.. 15 పరుగులు మాత్రమ ఇచ్చి ఓపెనర్లిద్దరితో పాటు వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌‌నూ అవుట్ చేసి మొత్తం 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా మొత్తం 4 ఓవర్లలో ఉనద్కట్‌ 15 డాట్‌ బాల్స్‌ కూడా వేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: