మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడడానికి వెటరన ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ నాయకత్వంలో శ్రీలంకకు వెళ్లిన యంగ్‌ ఇండియా క్రికెట్‌ కాకుండా మరో గేమ్‌ ఆడుతూ హంగామా చేస్తోంది. తొలి వన్డే ప్రారంభానికి ఇంకా పదిరోజులు సమయం ఉండడంతో ఆటగాళ్లను ఉత్తేజ పరచడానికి బీసీసీఐ ఒక వినూత్న గేమ్‌కు రూపకల్పన చేసింది. ఆ ఆట పేరు గెస్సింగ్‌ గేమ్‌ (ఏమిటో తెలుసుకోవడం). ఈ ఆట ఆడడానికి ఇద్దరు ప్లేయర్లు ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు తమకు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ టాస్క్‌ను విజయవంతంగా చేయడంలో ఫెయిల్‌ అవుతారో.. వారు ఓడిపోయినట్టు లెక్క. 

ఈ గెస్సింగ్‌ గేమ్‌లో రెండు పార్ట్‌లు ఉంటాయి. ముందుగా ఒకరు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవాలి. అతడికి ఎదుటవారు ఏం చెబుతున్నారో వినపడకుండా హెడ్‌ఫోన్స్‌లో మ్యూజిక్‌ ప్లే అవుతుంది. ఇంతలో రెండో వ్యక్తి బయటికి శబ్దం రాకుండా కొన్ని విషయాలు చెబుతాడు.. అవేంటో అవతలి వ్యక్తి చెప్పాలి. ఇది మ్యూజిక్‌.. మీమ్‌.. గెస్సింగ్‌ గేమ్‌ కహానీ. బీసీసీఐ ముందుగా ఈ చాలెంజ్‌ కెప్టెన శిఖర్ ధవన్‌, యువ ఓపెనర్‌ పృథ్వీషాకి ఇచ్చింది. గేమ్‌ ఎవరితో స్టార్ట్‌ చేయాలనేది చిట్టీలు వేసి నిర్ణయిస్తారు. అందులో ధవన్‌తో ఆరంభించాలని రావడంతో షా గేమ్‌ నిబంధనలు అతడికి వివరిస్తాడు. ఆ తర్వాత ధవన్‌ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్‌ వింటా ఉంటే షా మూగ యాక్షన్‌ చేయడం ప్రారంభిస్తాడు. నీకు అత్యంత ఇష్టమైన తినే పదార్థాలు ఏమిటని షా అడుగుతాడు? షా ఏమంటున్నాడో అర్థం కాక ధవన్‌ రకరకాల సమాధానాలు చెబుతాడు కానీ సరైన ఆన్సర్‌ చెప్పలేకపోతాడు. ఇక, ఆ తర్వాత పృథ్వీషా వంతు వస్తుంది. ధవన్‌ అతడికి కూడా సేమ్‌ కొశ్చన్‌ వేస్తాడు. పృథ్వీషా తొలుత చెప్పలేకపోయినా ఆ తర్వాత కిందమీద పడి అర్థం చేసుకొని వడా పావ్‌, చికెన్‌ అని చెబుతాడు. ఈ మధ్యలో పృథ్వీ పడే తిప్పలు చూసి ధవన్‌ పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటాడు. బీసీసీఐ వీరి ఫెర్ఫామెన్స్‌ను ఎడిటి చేసి ఒక 30 సెకన్ల వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: