* టోక్యోలో ప్రారంభించనున్న జపాన్‌ చక్రవర్తి
* భారత పతాకధారిగా మన్‌ప్రీత్‌ సింగ్‌

ఏడాదిగా ఎదురు చూస్తున్న విశ్వక్రీడల పండుగ ఎట్టకేలకు ప్రారంభమవుతున్న ఉద్విఘ్నం.. అటు అథ్లెట్లలో ఇటు క్రీడా పాలకులలో, దేశాధిపతులలో మొత్తంగా యావత్‌ ప్రపంచంలో ఉత్కంఠ రేపుతోంది. ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యంత భిన్నమైన వాతావరణంలో జరుగుతున్న 32వ విశ్వక్రీడలకు శుక్రవారం తెరలేవనుంది..

సహజంగా ఒలింపిక్స్‌ ప్రారంభం అంటే లేజర్‌ కాంతుల ధగధగలు. లక్షలాదిమంది క్రీడాభిమానులతో కిక్కిరిసే ప్రధాన స్టేడియం. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల హోరు. అసలు మాటల్లో వర్ణించలేని ఒక మహత్తర అనుభూతి. అలాంటిది కరోనా వైరస్‌ పడగలో.. టోక్యో వాసుల ఆందోళనల నడుమ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం సాదాసీదాగా జరగబోతోంది. కరోనా మహమ్మారి విలయతాండవంతో ఇప్పటికే విశ్వక్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న టోక్యోలో నాలుగో దశ హెల్త్‌ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. మొదట్లో కనీసం 10వేల మంది అతిథులనైనా ప్రారంభోత్సవానికి అనుమతించాలనుకున్నారు. అయితే, వైరస్‌ నియంత్రణలోకి రాకపోగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఖాళీ స్టేడియంలోనే ఆరంభ వేడుకులను జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు.

 
దాంతో ఆరవై వేల మంది సామర్థ్యం కలిగిన అత్యాధునిక నేషనల్‌ స్టేడియంలో కేవలం వేయి మంది అతిథుల సమక్షంలోనే ఒలింపిక్స్‌ పోటీలు అధికారికంగా ఆరంభమవనున్నాయి. జపాన్‌ చక్రవర్తి నరుహిటో, అమెరికా అధ్యక్షుడి సతీమణి, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. జపాన్‌ చక్రవర్తి నరుహిటో ఒలింపిక్స్‌ ప్రారంభమైనట్టు లాంఛనంగా ప్రకటిస్తారు. జపాన్‌ సంస్కతి, సంప్రదాయాలకు అద్దపంట్టే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 నుంచి ప్రారంభోత్సవం మొదలవుతుంది. సోనీ టీవీతోపాటు దూదర్శన, దూరదర్శన స్పోర్ట్‌ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. భారత్‌ నుంచి హాకీ జట్టు కెప్టెన్‌ మనప్రీత్ సింగ్‌ పతాకధారిగా వ్యవహరిస్తాడు. ఇతర ప్లేయర్లలో శరత కమల్‌, మనికా బాత్రా, ఫెన్సర్‌ భవానీదేవి, జిమ్నాస్ట్‌ ప్రణతీనాయక్‌, స్విమ్మర్‌ సాజన ప్రకాశ్ ప్రారంభ వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: