టోక్యో ఒలింపిక్స్ 2020లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించి భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. దీంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం కోసం భారత్‌ 21 సంవత్సరాల నిరీక్షణ ముగిసింది. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఈ పతకాన్ని గెలుచుకుంది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లలో మొత్తం 202 కిలోలను ఎత్తి మీరాబాయి ఈ పతకాన్ని గెలుచుకుంది. సోషల్ మీడియాలో కూడా ప్రజలు మీరాబాయి చానుపై అభినందనల వర్షం కురుస్తోంది. ఈ విజయం తరువాత ఆమె ఒక ఇంటర్వ్యూలో పిజ్జా తినాలనే కోరికను వ్యక్తం చేసింది. ఆమె కోరిక మేరకు డొమినోస్ అతనికి లైఫ్ టైం ఫ్రీ పిజ్జా ఇస్తానని ప్రకటించింది. డొమినోస్ ట్వీట్ చేస్తూ "ఆమె చెప్పింది మేము విన్నాము. మీరాబాయి చాను పిజ్జా తినడానికి వేచి ఉండాలని మేము ఎప్పుడూ కోరుకోము. అందుకే మేము ఆమెకు ఉచిత డొమినోస్ పిజ్జాను జీవితాంతం ఇస్తాము" అంటూ ప్రకటించింది. డొమినోస్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.


మీరాబాయి కంటే ముందు సిడ్నీ ఒలింపిక్స్‌లో కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌ ద్వారా దేశానికి కాంస్య పతకాన్ని గెలిచారు. 2000 సంవత్సరంలో ఇది జరిగింది. 21 సంవత్సరాల తరువాత ఇప్పుడు మీరాబాయి చాను రజత పతకం సాధించి దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.


ట్విట్టర్‌లో  మీరాబాయి చాను అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ "నిన్న నేను ఒలింపిక్స్‌లో నా మొదటి పతకాన్ని గెలుచుకున్నాను. భారతీయులందరూ నాకోసం ప్రార్థించారు. నా మొదటి పతకాన్ని దేశ ప్రజలందరికీ అంకితం చేయాలనుకుంటున్నాను. దేశ ప్రజలందరి కారణంగానే నేను ఒలింపిక్ క్రీడల్లో ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగాను. అందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు ఒలంపిక్స్ వైపు ప్రపంచమంతా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న ఇండియా అథ్లెట్స్ కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.  




మరింత సమాచారం తెలుసుకోండి: