మరి కొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ తలపడనుంది. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సరిగ్గా టైటిల్ పోరుకు ముందు నైట్ రైడర్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. అదే ఏమిటంటే... కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ మ్యాచ్ ఆడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం  దినేష్ కార్తిక్ తప్పు చేసినట్లు ఇప్పటికే రుజువైంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన క్వాలిఫైయిర్ -2 మ్యాచ్‌లో దినేష్ కార్తిక్... రబడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. అంతకు ముందే గిల్, నితీశ్ రాణా కూడా అవుటవ్వడంతో... దినేష్ అసహనానికి గురయ్యాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక... బ్యాటుతో వికెట్లను గట్టిగా కొట్టాడు. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధం. దీంతో దినేష్ కార్తిక్‌పై జరిమానా కూడా విధించారు.

అయితే ఐపీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ -1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం దినేష్ కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మ్యాచ్ అనంతరం తన నేరాన్ని కార్తీక్ కూడా అంగీకరించాడు. అయితే దినేష్‌పై చర్యలు తీసుకునే అధికారం మాత్రం మ్యాచ్ రిఫరీకే ఉంటుందని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే జరిమానాకు గురైన కోల్‌కతా కెప్టెన్... మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కూడా కట్టుబడి ఉండాల్సిందే. లెవల్ -1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం నియమావళి ఉల్లంఘించిన ఆటగాళ్లపై నిషేధం వేటు పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కార్తీక్ చేసిన పని కూడా ఇలాంటిదే. కార్తీక్ చేసిన తప్పును రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే... కార్తీక్‌పై మ్యాచ్ నిషేధం వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. గతంలో కూడా ఇలాంటి శిక్షలను ఐపీఎల్‌లో రెండు సార్లు విధించారు. దీంతో దినేష్‌పై కూడా మ్యాచ్ నిషేధం వేటు తప్పదని అంతా భావిస్తున్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఆడటం దాదాపు అనుమానమే. అసలే సూపర్ ఫామ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ముందు ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం కోల్‌కతాకు గట్టి షాక్ అనే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: