ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యంత కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటే.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా, టీమిండియా ఓపెనర్‌గా కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరు లేకుండా టీమిండియాను ఊహించుకోవడం ప్రస్తుతానికి కష్టమే. జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో వీరిద్దరే సీనియర్లు కూడా. మిగిలిన ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేయాలన్నా... జట్టును గాడిలో పెట్టాలన్నా కూడా వీరిద్దరు ఎంతో కీలకం. అలాంటి వీరిద్దరినీ పక్కన పెడుతోంది బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా. నిజమే... కోహ్లీ, రోహిత్ లేకుండానే అంతర్జాతీయ సీరిస్‌కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు స్వదేశీ గడ్డపై జరిగే మ్యాచ్‌లకు మాత్రమే... బీసీసీఐ ప్రయోగాలు చేసింది. సీనియర్ల స్థానంలో జూనియర్లను ఎంపిక చేశారు కూడా. అలాగే చిన్న జట్లపై జరిగే సిరీస్‌లకు సీనియర్లను దూరంగా పెట్టడం కూడా ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల సీనియర్లకు విశ్రాంతితో పాటు.... కొత్త వారికి అవకాశం కల్పించి... వారి సత్తా పరీక్షించేందుకు కూడా బీసీసీఐకి ఛాన్స్ ఉంటుంది.

అయితే తాజాగా బీసీసీఐ కీలక అడుగులు వేస్తోంది. యూఏఈ వేదికగా ఈ నెల 17వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ఇది ముగిసిన వెంటనే.... న్యూజీలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచులు ఇరు జట్ల మధ్య జరగనున్నాయి. నవంబర్ నెల 17, 19, 21 తేదీల్లో టీ 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లకు కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీతో బిజీ బిజీగా ఉన్న ప్లేయర్స్.... ఈ టోర్నీ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీతో మరింత అలసిపోయే అవకాశం ఉంది. దీంతో వీరికి విశ్రాంతి కల్పించాలనేది టీమిండియా భావన. వీరికి బదులుగా ఐపీఎల్‌ టోర్నీలో విశేషంగా రాణించిన వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాత్ గ్రైక్వాడ్, ఆవేష్ ఖాన్‌లకు అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దాదాపు 5 నెలలుగా టీమిండియా సీనియర్ ప్లేయర్స్... బయోబబుల్‌లో ఉన్నారని... వీరికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలనేది టీమిండియా ఆలోచన.


మరింత సమాచారం తెలుసుకోండి: