టీమిండియా  ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ త్వ‌ర‌లోనే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న విష‌యం విధిత‌మే. న‌వంబ‌ర్ 17 నుంచి న్యూజీలాండ్‌తో జ‌రిగే టీ-20 సిరీస్ నుంచి ప్రధాన కోచ్‌గా  ప్రారంభించనున్నాడు ద్రవిడ్. ఇక   రవిశాస్త్రి  ప్ర‌ధాన‌కోచ్  పదవీ కాలం ముగియడంతో అతడితో పాటు పని చేసిన సపోర్టింగ్ స్టాఫ్  గ‌డువు కూడా తీరిన‌ది. దీంతో కొత్త హెడ్ కోచ్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ కోసం కూడా బీసీసీఐ దరఖాస్తులకు  ఆహ్వానించిన‌ది.  అయితే మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, శ్రీధర్ పదవీ కాలం ముగిసిన‌ది.  వారి స్థానంలో కొత్త వారి నియామకానికి బీసీసీఐ కసరత్తు చేప‌ట్టింది.  కేవలం పాత వారిలో  బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం క్రికెట్ అడ్వైజరీ కమిటీ రాథోడ్‌కు మరోసారి అవకాశం కల్పించిన‌ది.  బౌలింగ్ కోచ్‌గా పరాస్ మంబ్రేను ఇప్ప‌టికే ఎంపిక చేసారు. రాహుల్ ద్రవిడ్‌తో కలసి నేషనల్ క్రికెట్ అకాడమీ లో పని చేసిన‌ మంచి అనుభవం ఉండటంతో సీఏసీ పచ్చ జెండా ఊపింది.

ఫీల్డింగ్  కోచ్‌గా ఆర్. శ్రీదర్ స్థానంలో   చెందిన దిలీప్ బాధ్యతలు నిర్వ‌ర్తించ‌నున్నాడు.  తెలంగాణకు చెందిన టి. దిలీప్‌కు  ఫీల్డింగ్ కోచ్‌గా మంచి అనుభవం  ఉన్న‌ది.  14 ఏండ్ల‌ తన కోచింగ్ కెరీర్‌లో ఇండియా అండర్ - 19, ఫస్ట్ క్లాస్ జట్లకు కోచ్‌గా పని చేసాడు.  భారత జట్టు ఇటీవ‌ల శ్రీలంకలో  పర్యటించిన సమయంలో తాత్కాలిక ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. దిలీప్ తన క్రికెట్ కెరీర్‌లో హెచ్‌సీఏ ఏ-డివిజన్ లీగ్‌ల‌లో కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ తరపున పలు మ్యాచ్‌లను ఆడాడు. క్రికెట్ కెరీర్ తరువాత  బీసీసీఐ లెవెల్-3 శిక్షణను పూర్తి చేసుకున్న దిలీప్  అనంత‌రం పూర్తి స్థాయి కోచ్‌గా మారాడు. ప్ర‌స్తుతం  భారత జట్టులో ఉన్న పలువురు యువకులకు ఫీల్డింగ్ మెలకువలు నేర్పిన అనుభవం  దిలీప్ కు ఉంది.

భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌గా విక్రమ్ రాథోడ్, పరాస్ మంబ్రే  ఖ‌రార‌య్యారు. ఫీల్డింగ్ కోచ్‌గా అభ‌య్ శ‌ర్మ‌ను తీసుకోవాల‌ని రాహుల్ ద్ర‌విడ్ సూచించిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా సీఏసీ ముందుకు సుల‌క్ష‌ణ నాయ‌క్‌, ఆర్‌పీ సింగ్ పేర్లు కూడ వ‌చ్చాయి. ఎన్ఏసీలో రాహుల్ ద్ర‌విడ్ కొలిగ్‌, ఇండియా ఏ, ఇండియా అండ‌ర్‌-19 జ‌ట్ల‌కు ప‌ని చేసిన అనుభ‌వంతో అభ‌య్‌శ‌ర్మ‌ను తీసుకుంటార‌ని అంద‌రూ ఊహించారు. కానీ శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌లో దిలీప్ ప‌ని తీరుపై ఓ అంచెనాకు వ‌చ్చిన త‌రువాత రాహుల్‌కు ఆ నిర్ణ‌యాన్ని చెప్పార‌ట‌. దీంతో దిలీప్ ప‌ని తీర్పుపై రాహుల్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. రాహుల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో భార‌త జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ నియామ‌కం ఖ‌రారు అయిన‌ది.

హైద‌రాబాద్ కు చెందిన దిలీప్ భార‌త జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైన‌ట్టు  ఓ ప్ర‌ట‌కనను హెచ్‌సీఏ విడుద‌ల చేసింది.  జాతీయ స్థాయిలో తెలంగాణ వ్య‌క్తికి బాధ్య‌త‌లు ద‌క్క‌డంపై హెచ్‌సీఏ అభినందించిన‌ది. దిలీప్ నియామ‌కంపై హెచ్‌సీఏ కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ హ‌ర్శం వ్య‌క్తం చేసారు. అయితే బీసీసీఐ  ఈ ముగ్గురి నియ‌మాకాన్ని అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాలి మ‌రి.


















మరింత సమాచారం తెలుసుకోండి: