న్యూజీలాండ్‌తో ప్రారంభమైన మూడు టీ20ల సీరిస్‌ను ఇండియా ఘనంగా ప్రారంభించింది. ఇటీవలే టీ 20 ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓటమితో ఇంటి బాట పట్టిన ఇండియా.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. న్యూజీలాండ్ మంచి స్కోరే చేసినా.. భారత ఆటగాళ్లు విజయవంతంగా ఈ లక్ష్యాన్ని చేధించి సీరిస్‌లో ముందంజ వేశారు. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా.. అలాగే హిట్ మ్యాన్ గా పేరున్న రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా టీమిండియా స‌రికొత్త ప్రస్థానం అదిరిపోయింది. మొదటి రోజే సంచలన విజయం నమోదు చేసింది.


ఫ‌స్ట్ టి20లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 164 ప‌రుగులు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది భారీ టార్గెట్‌ గానే చెప్పుకోవాలి. ఇక  165 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన టీమిండియా మొద‌టి నుంచి దూకుడుగానే ఆడింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మాంచి దూకుడుతో మొద‌టి 5 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగులు దాటించేసారు. అయితే.. ఆ త‌ర్వాత ఆరో ఓవ‌ర్‌లోనే రాహుల్ అవుట‌య్యాడు. ఆ సమయంలో ఇండియా స్కోరు 56/1 గా ఉంది.


రాహుల్ ఔట్ త‌ర్వాత రోహిత్ కు జోడీగా సూర్య కుమార్ యాద‌వ్ రంగంలోకి దిగాడు. అలా వీరి భాగస్వామ్యం 13 ఓవ‌ర్ల వ‌ర‌కు బాగానే సాగింది. అయితే.. 14వ ఓవ‌ర్‌లో రోహిత్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత రంగంలోకి వచ్చిన రిష‌బ్ పంత్,  సూర్య కుమార్ కాస్త దూకుడు పెంచారు. అలా అలా సాగుతూ ఉన్న ఇండియా బ్యాటింగ్‌లో 18వ ఓవ‌ర్లో మరో కుదుపు తగిలింది.  సూర్యకుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయ‌స్ అయ్యర్ బ‌రిలోకి వచ్చాడు.


అయ్యర్ వచ్చేసరికి ఇండియా స్కోరు 149/3. ఇక అక్కడి నుంచి మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ ను మరిపించింది. బాల్ బాల్‌కూ అదృష్టం చేతులు మారుతూ వచ్చిందని చెప్పాలి. 19వ ఓవ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్యర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పుడు స్కోరు 155/4. ఆ సమయంలో భారత విజయానికి 7 బాల్స్ ఉండ‌గా 10 ప‌రుగులు చేయాలి. పంత్ కు జోడీగా  వెంక‌టేశ్ అయ్యర్ రంగంలోకి దిగాడు. 160 స్కోరు వద్ద వెంకటేశ్ అయ్యర్ క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి ఇంకా నాలుగు బంతుల్లో ఇండియా 5 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో పంత్ కు జోడీగా వచ్చిన అక్సర్ సింగిల్ తీశాడు. బ్యాటింగ్ పంత్ కి ఇచ్చాడు. పంత్ ఫోర్  కొట్టి.. రెండు బంతులు మిగిలి ఉండగానే ఇండియాను గెలిపించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: